బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీక్ష మొదలు పెట్టాడు. దీక్ష ఎందుకు మొదలు పెట్టాడోచూస్తే దీని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవడం కష్టం కాదు.ఎవరైనా ఒక వ్యవస్థ వలన తమకు అన్యాజరుగుతుంది అని అనుకుంటే ఆ వ్యవస్థలో మార్పును కోరుకుంటారు. కాని వ్యవస్థ అన్యాయం చేస్తుంది అని చెప్పుతూనే తిరిగి అదే వ్యవస్థను కోరుకోవడమంటే ప్రజలను మభ్యపెట్టాలని చూడడం తప్ప మరోటి కాదు.
ఈ బైరెడ్డి ఒక తెలుగుదేశం నాయకుడు. ఈయన, వీళ్ళ నాయకుడు కాంగ్రేస్ పార్టీ పరిపాలనలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని దొరికిన ప్రతి వేదిక మీదా చెప్తుంటారు. మరి అటువంటప్పుడు తిరిగి అదే పార్టీని ఎన్నుకొమ్మని చెప్పగలరా? ఎవరిని మోసగిద్దామని ఇటువంటి వాదనలు?
ఆయన డిమాండ్లు వింటే పసిపిల్లగాడికి కూడా నవ్వురాక మానదు. సమైక్య రాష్ట్రంలో రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం జరిగిందట. అందుకని రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలట! విడిపోవలసి వస్తే ప్రత్యేక రాయలసీమ కావాలట!
ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగానే వుంది. దిసెంబరు 23న చిదంబరం పలాయనం చిత్తగించిన తర్వాత తెలంగాణాపై ఇంకో ప్రకటన ఇంతవరకు రానేలేదు. మరి అప్పుడే దీక్షలు ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది?
అంతేకాదు, సమైక్య రాష్ట్రంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఒకవైపు చెపుతూనే, మరో వైపు రాష్ట్రం సమైక్యంగా వుంచాలని కోరడంలో ఉద్దేశమేమిటి? వీటికి సహేతుకమైన కారణాలేమీ కనిపించవు. మరి ఈ చోటా నాయకుని హటాత్తు దీక్షకు కారణాలేమిటి?
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును కాదని ఎవరైనా దీక్షలో ధర్నాలో చేయగలిగిన స్వతంత్ర్యమే వుంటే, తెలంగాణా తెలుగు తమ్ముళ్ళు ఇలా డిపాజిట్లు కోల్పోయే వారే కాదు. బాబు అనుమతి తీసుకొని ఏడాది కోసారి ఉత్తుత్తి బస్సు యాత్రలు చేస్తూ, ఆ వేదికని కూడా TRSనో, JACనో తిట్టడానికి వాడుకుంటారు తప్ప ఏనాడూ వారు తెలంగాణా కోసం నిఖార్సైన పోరాటం చేయలేదు.
ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎదుర్కుంటూ కూడా తెలంగాణా తెలుగుదేశం నాయకులు ఏమీ చేయలేక పోతుంటే, నాయకున్ని ధిక్కరించి, ఆలూ చూలు లేకుండా బైరెడ్డి దీక్షలు మొదలు పెడతాడని ఎలా అనుకోగలం? ఈ దీక్ష బైరెడ్డి మనసులోంచో, రాయలసీమ మనోభావాల్లోంచో వచ్చింది కాదు. చంద్రబాబు కుటిల రాజకీయంలో మరో అంకమే ఈ తాజా దీక్ష.
మరి ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు బైరెడ్డి డ్రామా నడిపించ వలసిన అవసరం ఎందుకొచ్చింది? చంద్రబాబు కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకి. అంధ్రా కాంగ్రేస్ నాయకుల అభిప్రాయాలు ఎలా వున్నా, ఉప ఎన్నికెల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రేస్ పార్టీ, ఇంకా నాన్చకుండా తెలంగాణాపై నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనిపించాయి. ఆ నిర్ణయం తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా వుండకుండా ప్రభావితం చేయాలంటే, ఇలాంటిది ఏదో ఒకటి చేయాలి. వెన్నుపోట్లలో రాటుదేలిన చంద్రబాబు ఇది తెలంగాణా పై చేస్తున్న మరో వెన్నుపోటు మాత్రమే.
గతంలో డిసెంబరు తొమ్మిది ప్రకటన వచ్చిన తర్వాత దొంగ వుద్యమం చేయించిన అనుభవం ఎలానూ వుండనే వుంది. ఆ క్రమంలో మొదలైందే ఈ సమెక్కుడు ఉద్యమం. సమెక్కుడు అని ఎందుకంటున్నానంటే, ఆ ఉద్యమం తీరే అలా వుంది కనుక.
ఎవడైనా రాయలసీమకు సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగింది అనుకుంటే, ఆ సమైక్యతకు వ్యతిరేకంగా వుద్యమం చేస్తాడు తప్ప, దానికోసమే డిమాండు చేయడు. అలాగే అంత సమైక్యతా రాగాలు ఆలపించే వాడు, మరి ఆంధ్రా వారితో సమైక్యత ఎందుకు కోరుకోవడం లేదు? ఇదంతా సమస్యపై మరింత గందరగోళం సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఇరకాటం లోనికి నెట్టడం, తద్వారా అది నిర్ణయాన్ని మరింత జాప్యం చేసేలా చూడడం తప్ప మరోటి కాదు.
అధికారం కోల్పోయాక చంద్రబాబు పన్నిన ఏ వ్యూహం కూడా సరైన ఫలితాలు ఇవ్వలేదు. అలాగే ఇదికూడా తుస్సుమనడం తథ్యం. రాజకీయ పరిణతి మందగించిన చంద్రబాబు ప్రజలు కూడా అలాగే వున్నారని భావిస్తే తప్పు. వెన్నుపోట్లలో తనను మించిన వాడు లేడని విర్రవీగుతున్న చంద్రబాబును ప్రజలు ఇప్పటికే ఎన్నికల పోట్లతో బెంబేలెత్తిస్తున్నారు.
జనం రోజురోజుకూ రాజకీయ పరిణతి పెంచుకొంటున్నారు. అందుకే 'నేరుగా డబ్బు', 'మారిపోయాను', 'అన్నీ ఉచితం', 'రెండుకళ్ళు' లాంటి ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ఆయన్ను చీత్కరించి డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన కాస్త కుటిల నీతులను పక్కకు పెట్టి నిజాయితీగా ఆలోచిచడం నేర్చుకుంటే, అది ఆయనకూ, వారి పార్టీకీ మంచిది.
No comments:
Post a Comment