Friday, August 31, 2012

సర్వేక్షణం

తాజాగా NDTV చేసిన Mid term Poll 2012 సర్వేలో ప్రకటించబడ్డ ఫలితాలు ఆసక్తికరంగా వున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రా సోదరులు 'మా ప్రాంతం వారికి రాజకీయ జ్ఞానం ఎక్కువ, అందుకే మేం గొప్ప వాళ్ళను ఎన్నుకుంటాం, తద్వారా ఘోప్పగా డెవలప్ అవుతాం' అని ఎప్పుడూ చెప్పే మాటలు ఎంత డొల్లలో బయట పెట్టాయి. వారు బయటికి ఏం డబ్బా కొట్టుకున్నా, సర్వే ఫలితాలు మాత్రం అక్కడ అభ్యర్థి మంచి చెడుల కంటే, కేవలం ఇతర కారణాలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయన్న విషయాన్ని స్పష్టీకరించాయి. అదే సమయంలో తెలంగాణా ప్రాంతంలో జరిపిన సర్వేలో ప్రజలు అత్యంత రాజకీయ పరిణతి చూపించారు.

ఇక ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న విషయానికి వస్తే, ఆంధ్రాలో జగన్ 21 సీట్లలో గెలిచే అవకాశాలుండగా తెలంగాణలో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. లక్ష కోట్ల అవినీతితో జైల్లో ముక్కుతున్న వ్యక్తిని సముచితమైన రీతిలోనే సత్కరించ బోతున్నారు తెలంగాణా ప్రజలు.


ఇక పోతే జగన్ మీద పెట్టిన కేసులు సముచితమైనవేనా అన్న ప్రశ్నకు డెబ్బైఆరు శాతం మంది తెలంగాణా ప్రజలు ఉచితమే నని సమాధానం చెప్తే, ఆంధ్రాలో మాత్రం కేవలం నలభై ఆరు శాతం మంది మాత్రమే అలా భావిస్తున్నారు. 56 శాతం మందికి జగన్ పై కేసులు పెడుతున్నందుకు బాధగా ఉన్నట్టుంది!


సరే, జగన్ పార్టీ సిద్ధాంతాలపై జనానికి గురి కుదిరి ఉండొచ్చు, జగన్ పై పెట్టిన కేసులు కాంగ్రెస్ రాజకీయ దురుద్దేశాలతో పెట్టిందీ అని భావించ వచ్చు. ఆయా కారణాలతో పై విధంగా స్పందించారని అనుకుందాం. మరి ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు అని సూటిగా అడిగిన ప్రశ్నకి ఆంధ్రాలో 62% మంది జగన్ కే వోటు వేశారంటే, వారి రాజకీయ పరిణతి గురించి ఆశ్చర్యం కలగక మానదు. జగన్ అవినీతిలో మెగాస్టారని తెలంగాణా లోనే కాదు, ఆంధ్రాలోని చిన్న పిల్ల వాడిని అడిగినా కూడా చెప్ప గలడు.


ఇటువంటి ఎన్నికల ఫలితాలు ఇది మొదటి సారి కాదు. గత ఎన్నికల ఫలితాలు చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. అవినీతి కూపంలో మునిగిన రాజశేఖర్ రెడ్డి కన్నా మహా కూటమినే ఎక్కువ సీట్లలో గెలిపించారు. అందుకే తెలంగాణలో కేవలం యాభై సీట్లకే పరిమితమైనా ఆంధ్రలో 107 సీట్లు గెలిచి మరోసారి అందికారం చేజిక్కించు కుంది కాంగ్రెస్.

తెలంగాణా ప్రజలు విడిపోవాలని కొరుకొవడానికి ఇదో ముఖ్య కారణం. ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రజలకు తమ ఆకాంక్షలు నెరవేరక పోవడమే కాదు, తాము కోరుకొన్న పార్టీని వారు ఎప్పటికీ అందలం ఎక్కించ లేరు. ఫలితాలు ఎప్పుడూ ఆంధ్రా లోని కులతత్వ రాజకీయాలతో మాత్రమే ముడిపడి వుంటాయి. ఆ విధంగా గెలిచిన తస్మదీయ నాయకులు ఎప్పుడూ ఆ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు మాత్రమే ఉత్సాహం చూపుతారు. ఎన్నికల వల్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగదు. పైరవీల కోసమో, మంత్రి పదవుల కోసమో, తెలంగాణా నుంచి గెలిచినవారు కూడా ఆ ప్రాంతపు అధినాయకుని భజనలు చేయ వలసిందే.

ఇక కోసమెరుపేమంటే, తెలంగాణలో 86% మంది రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని, సర్వే నిర్ద్వందంగా భారతదేశ ప్రజలకు తెలియజేసింది. అంతే కాదు ఆంధ్రాలో కూడా 24% మంది విభజన వైపే మొగ్గు చూపుతున్నారని కూడా చెప్పింది.


ఇప్పటికైనా కొంతమంది సమెక్కుడు వాదులు తమ దుష్ప్రచారాలను ఆపివేస్తే అందరికీ మంచిది.

Curtesy: NDTV

Sunday, August 19, 2012

తెలంగాణ వైపు తెలుగుదేశం


ఉప ఎన్నికల ఫలితాలు చూసినంక చంద్రబాబుకు 2014 ఎన్నికల జ్వరం మొదలైంది. జ్వరం కంటే భయం అంటే బాగుంటదేమో? వానాకాలం వచ్చే ముందు పేద గృహస్తు గుడిసె సదురుకున్నట్టు, చంద్రబాబు పార్టీని సదురుడు మొదలు పెట్టిండు.

బీసీలను కూసుండ పెట్టి పార్టీల పెద్ద పీట వేస్తనని చెప్పిండు. పోయిన సారి గట్లనే చెప్పి ఇయ్యక పోయినా ఈసారి తప్పకుంట ఇస్తానని నమ్మవల్క వట్టిండు. పార్టీల జెరంత ఉషారు గనిపిచ్చినట్టుంది! వెంటనే SC లను ABCD గ్రూపులు జేస్తందుకు గూడ మద్దతిస్తనని చెప్పిండు. అదే ఉషారుల తెలంగాణా ఏర్పాటుకు చిదంబరంకు లేఖ ఇస్తానని కూడా ఫీలర్స్ వదులుడు మొదలు పెట్టిండు.

అంతకు ముందు నమ్మిన బంటు బైరెడ్డి తోని దీక్ష చేయించి తిట్టించిన బైరెడ్డి నోటి వెంటనే 'తెలంగాణా ఇచ్చుడు తప్పదు, తెలంగాణా ఆబాల గోపాలానికి గట్టి కోరిక వున్నది' అని చెప్పించిండు. ఆ వెంటనే బావమరది బాలకృష్ణ తోటి తెలంగాణా ఏర్పాటును తమ పార్టీ బలపరుస్తున్నట్టు చెప్పించిండు.

గివన్ని చూస్తుంటే కేంద్రానికి బాబు తెలంగాణని సపోర్టు జేసుకుంట లేఖ ఇస్తట్టే కనపడుతుంది. గా వుత్తరం ఇచ్చినంక తెలంగాణల బలంగా ఉద్యమం చేస్తమని తెలుగు తమ్ముళ్ళు అప్పుడే చెప్పుడు షురూ జేసినరు.

గియ్యన్ని తెలంగాణకు శుభ పరిణామాల లెక్కనే కనపడుతున్నయి. ఇప్పటికే TRS కాక BJP, CPI లు బలంగా తెలంగాణా వాదం వినిపిస్తున్నాయి. వీటికి తోడు తెలుగుదేశం కూడ జమైతే బాగానే వుంటది.

అయితే ఎక్కడ బొక్కలుంటే అక్కడికి కుక్క లెగబడుడు కొత్త ముచ్చట గాదు. గీ తెలుగుదేశం హడావుడి చూస్తా వుంటే గదే అనుమానం రాక మానదు. అట్ల అనుమానం వచ్చేటందుకు కూడా కారణాలున్నయి.

గిసుమంటి ఉత్తరం 2008ఎన్నికలకు ముందు గూడ చంద్రబాబు ప్రణభ్ ముఖర్జీకి ఇచ్చిండు. ఎన్నికల్ల తెలంగాణల అధిక దామాషాల సీట్లు గెలిచిండు. అయినా గూడ కేంద్రం తెలంగాణ ఏర్పాటును ప్రకటించంగనే తెలంగాణా తెప్ప తగలేసిండు. సీమాంధ్ర మరబోటుకు మారిపోయిండు. మరి ఇప్పుడు గూడ 2014 ఎన్నికల ఏరు దాటినంక తెప్ప మల్లోకసారి తగలేయడని గ్యారంటీ ఉందా?

ఈ మార్పు తెలంగాణా సీట్ల మీద ఆశ తోటే కావొచ్చు. తెలంగాణా వాదం ఇప్పటికే వినిపిస్తున్న మిగతా పార్టీలు కూడా వోట్లు, సీట్లకు కొట్లాడవా అని అడుగొచ్చు. కాకపొతే ఆ పార్టీలు చాలా కాలంగా అదే వాదం వినిపిస్తున్నయి. వోట్లు, సీట్లు రాక పోయినంత మాత్రాన తమ వాదాన్ని మార్చుకోలేదు. కాని చంద్రబాబు, ఆయన పార్టీ అట్లగాదు. ఇప్పటికి మూన్నాలుగుసార్లు తమ వైఖరి మార్చిన ఘనత ఆ పార్టీది.

రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను మార్చుకోగూడదని రూలు ఎక్కడ గూడ లేదు. కాకపొతే గిన్ని సార్లు మార్చుకున్న మనిషి ఇంకోసారి గట్లనే చెయ్యడని గ్యారంటీ లేదు. కాబట్టి ప్రజలను నమ్మించ వలసిన బాధ్యత, తన నిబద్ధతను చాటుకోవలసిన బాధ్యత గూడ చంద్రబాబు మీదనే వున్నది.

తెలంగాణా ప్రజలు మాత్రం ఈయన వేషాలను జాగ్రత్తగనే గమనించాలే. 2009 వోలె ఈయన మాటలు నమ్మితిమా? తెలంగాణాను మల్లొకసారి అమ్ముకున్నట్టే. 

Friday, August 10, 2012

గిదీ తెలంగాణ పరిస్థితి

దేశంల ఎక్కడ లేని వానలు తెలంగాణలనే పడ్డయట. మీటియోరాలాజికల్ డిపార్టుమెంటే చెప్పవట్టింది. సీమల, ఆంధ్రల తక్కువ కురిసినయట. గీ రిపోర్టుల పుణ్యమా అని తెలంగాణకు కరువు సాయం కరువైతది.



కరడుగట్టిన ప్రాంత పక్షపాత సమైక్య సాములేమో, తెలంగాణా ఎండగట్టి, తాగే నీళ్ళు గూడ లేకుండ, గద్దల్లెక్క తన్నుక పోతరు. వాల్ల మూడో కారుకు చుక్క తగ్గకుండ తహతహలాడి పోతరు. తెలంగాణ జనమేమొ నీళ్ళు పోతుంటె గుడ్లల్లకు నీళ్ళు తెచ్చుకొని చూస్తుంటరు. 

గవర్నమెంటు లెక్కలల్ల వానలు దండిగ పడుతున్నయి కాబట్టి తెలంగాణకు కరువు సాయం సున్న. కరువు సాయం రాదు, విత్తనాలు రావు, నీళ్ళు వుండవు. గిదీ తెలంగాణ పరిస్థితి. 

ఆ సంగతి గట్లుంటె, పడ్డ వానలన్న నిలుస్తయా అంటె ఉన్న కొద్ది పాటి ప్రాజెక్టులకు కూడ గండ్లు. లక్షా పదిహేను కోట్ల బడ్జెటు గల్ల ఘనమైనా రాష్ట్రం, అనుమతులు సక్కగ లేని దిక్కుమాలిన పోలవరలకు వేలకోట్లు కర్చు చేస్తది గాని, జూరాల ప్రాజెక్టు గేట్లను బాగ చెయ్యనీకి చిల్లి గవ్వలు కూడ లేవట! ఇట్ల వొచ్చిన నీళ్ళు అట్లనే పోబట్టినయి. నీల్లు వచ్చినా నిలుపోలేని ప్రాజెక్టులు బిడ్డ చస్తుంటె చూస్తున్న తల్లి లెక్క బావురు మంటున్నయి. అయినా ఎన్ని నీళ్ళు పోతె వాళ్ళకు అంత లాభం. నీళ్ళు పల్లానికి మాత్రమే ప్రవహించాలనే సిద్ధాంతం వారిది మరి!


కాకతీయుల కాలం నుంచి తెలంగాణల చెరువుల తొవ్వకం, చెరువునీళ్ళ సాగు ఆనవాయితీ. కాకతీయుల కాలం తర్వాత వచ్చిన సుల్తాన్లు, నవాబులు కూడా గదే పద్ధతి పాటించిన్రు. కాని గా పద్ధతి మన సమైక్య పాలకులకు అస్సలు నచ్చలేదు. ఉన్న చెరువులన్ని పాడు బెట్టిన్రు. మిగిలిన చెరువులు రిపేర్లు లేక గండ్లు పడి, ఎండి పొయినై.. భూగర్భ జలాలు అడుగంటి, రైతు తాళిబొట్టు కానించి  అమ్ముకొని బోర్లు వేయించినా నీళ్ళు పడని దుస్థితి.



వారికి కావలసిందీ అదే. ఇక్కడ చెరువులు పూడిక నిండి, గండ్లు పడి నీల్లు నదులల్ల గలిస్తెనే వారి దృష్టిలో అక్కడ సౌభాగ్యం. మరి రిపేర్లు ఎందుకు జేస్తరు? పూడికలెందుకు తీస్తరు?

మన గోస సమైక్య పాలకులకు అర్థం కాదు. మన బాధలు వాళ్ళ చెవులకు ఆనవు. ఉమ్మడి రాష్ట్రంల  కలిసి వున్నంత వరకూ మనకు అధికారం రాదు, ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం వాల్లే కాబట్టి. ఇంమనకు నీళ్ళు లేక గాదు, నదులు లేక గాదు, గనులు లేక గాదు. అన్నీ వున్నంక ఏమీ లేనట్టు గీల్లను దేబిరించుకుంట ఉండుదు అవసరమా? అందుకే మనరాష్ట్రం వచ్చే దాంక పోరాడి సాధించుకుందాం. 

Monday, August 6, 2012

వాదనలు


ఒక తెలంగాణా వాది రోదన:

మా నీళ్ళు దోచుకుంటున్నరు
మా నిధులు కొల్లగొడుతున్నరు
మా సంస్కృతి నాశనం బట్టిస్తున్నరు
మా ఉద్యోగాలు మీరే లాక్కుంటున్నరు
మా కాలేజీ సీట్లు మీరే వాడుకుంటున్నరు

మా తెలంగాణా మాకివ్వండి.

సగటు ఆంధ్ర సమైక్యవాది వాదన:
 
నీళ్ళలో మాకే అన్యాయం జరిగింది
నిధుల్లో మాకే అన్యాయం జరిగిది
అయినా సరే సమైక్యంగా వుంటాం
ఎందుకంటే
మా పెట్టుబడిదారులు 
హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారు కాబట్టి.

సగటు రాయలసీమ వాది గోల:

సమైక్య రాష్ట్రం వల్ల
మోసపోయింది మేమే
మా రాజధాని కోల్పోయాం
అన్ని విధాలా నష్టపోయాం
అయినా సరే సమైక్యంగా వుంటాం
ఒకవేళ తెలంగాణా విడిపోతే మటుకు
మేం ఆంధ్రులతో కలిసి
ఒక్కరోజు కూడా వుండలేం
మా రాష్ట్రం మాగ్గావాలి.

Sunday, August 5, 2012

బైరెడ్డి దీక్ష




బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీక్ష మొదలు పెట్టాడు. దీక్ష ఎందుకు మొదలు పెట్టాడోచూస్తే దీని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవడం కష్టం కాదు.ఎవరైనా ఒక వ్యవస్థ వలన తమకు అన్యాజరుగుతుంది అని అనుకుంటే ఆ వ్యవస్థలో మార్పును కోరుకుంటారు. కాని వ్యవస్థ అన్యాయం చేస్తుంది అని చెప్పుతూనే తిరిగి అదే వ్యవస్థను కోరుకోవడమంటే ప్రజలను మభ్యపెట్టాలని చూడడం తప్ప మరోటి కాదు.

ఈ బైరెడ్డి ఒక తెలుగుదేశం నాయకుడు. ఈయన, వీళ్ళ నాయకుడు కాంగ్రేస్ పార్టీ పరిపాలనలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని దొరికిన ప్రతి వేదిక మీదా చెప్తుంటారు. మరి అటువంటప్పుడు తిరిగి అదే పార్టీని ఎన్నుకొమ్మని చెప్పగలరా? ఎవరిని మోసగిద్దామని ఇటువంటి వాదనలు?

ఆయన డిమాండ్లు వింటే పసిపిల్లగాడికి కూడా నవ్వురాక మానదు. సమైక్య రాష్ట్రంలో రాయలసీమకు అన్ని విధాలా అన్యాయం జరిగిందట. అందుకని రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలట! విడిపోవలసి వస్తే ప్రత్యేక రాయలసీమ కావాలట!

ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగానే వుంది. దిసెంబరు 23న చిదంబరం పలాయనం చిత్తగించిన తర్వాత తెలంగాణాపై ఇంకో ప్రకటన ఇంతవరకు రానేలేదు. మరి అప్పుడే దీక్షలు ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది?

అంతేకాదు, సమైక్య రాష్ట్రంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఒకవైపు చెపుతూనే, మరో వైపు రాష్ట్రం సమైక్యంగా వుంచాలని కోరడంలో ఉద్దేశమేమిటి? వీటికి సహేతుకమైన కారణాలేమీ కనిపించవు. మరి ఈ చోటా నాయకుని హటాత్తు దీక్షకు కారణాలేమిటి?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును కాదని ఎవరైనా దీక్షలో ధర్నాలో చేయగలిగిన స్వతంత్ర్యమే వుంటే, తెలంగాణా తెలుగు తమ్ముళ్ళు ఇలా డిపాజిట్లు కోల్పోయే వారే కాదు. బాబు అనుమతి తీసుకొని ఏడాది కోసారి ఉత్తుత్తి బస్సు యాత్రలు చేస్తూ, ఆ వేదికని కూడా TRSనో, JACనో తిట్టడానికి వాడుకుంటారు తప్ప ఏనాడూ వారు తెలంగాణా కోసం నిఖార్సైన పోరాటం చేయలేదు.

ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎదుర్కుంటూ కూడా తెలంగాణా తెలుగుదేశం నాయకులు ఏమీ చేయలేక పోతుంటే, నాయకున్ని ధిక్కరించి, ఆలూ చూలు లేకుండా బైరెడ్డి దీక్షలు మొదలు పెడతాడని ఎలా అనుకోగలం? ఈ దీక్ష బైరెడ్డి మనసులోంచో, రాయలసీమ మనోభావాల్లోంచో వచ్చింది కాదు. చంద్రబాబు కుటిల రాజకీయంలో మరో అంకమే ఈ తాజా దీక్ష.

మరి ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు బైరెడ్డి డ్రామా నడిపించ వలసిన అవసరం ఎందుకొచ్చింది? చంద్రబాబు కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకి. అంధ్రా కాంగ్రేస్ నాయకుల అభిప్రాయాలు ఎలా వున్నా, ఉప ఎన్నికెల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రేస్ పార్టీ, ఇంకా నాన్చకుండా తెలంగాణాపై నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనిపించాయి. ఆ నిర్ణయం తెలంగాణా ఏర్పాటుకు అనుకూలంగా వుండకుండా ప్రభావితం చేయాలంటే, ఇలాంటిది ఏదో ఒకటి చేయాలి. వెన్నుపోట్లలో రాటుదేలిన చంద్రబాబు ఇది తెలంగాణా పై చేస్తున్న మరో వెన్నుపోటు మాత్రమే.

గతంలో డిసెంబరు తొమ్మిది ప్రకటన వచ్చిన తర్వాత దొంగ వుద్యమం చేయించిన అనుభవం ఎలానూ వుండనే వుంది. ఆ క్రమంలో మొదలైందే ఈ సమెక్కుడు ఉద్యమం. సమెక్కుడు అని ఎందుకంటున్నానంటే, ఆ ఉద్యమం తీరే అలా వుంది కనుక.

ఎవడైనా రాయలసీమకు సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగింది అనుకుంటే, ఆ సమైక్యతకు వ్యతిరేకంగా వుద్యమం చేస్తాడు తప్ప, దానికోసమే డిమాండు చేయడు. అలాగే అంత సమైక్యతా రాగాలు ఆలపించే వాడు, మరి ఆంధ్రా వారితో సమైక్యత ఎందుకు కోరుకోవడం లేదు? ఇదంతా సమస్యపై మరింత గందరగోళం సృష్టించి కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఇరకాటం లోనికి నెట్టడం, తద్వారా అది నిర్ణయాన్ని మరింత జాప్యం చేసేలా చూడడం తప్ప మరోటి కాదు.

అధికారం కోల్పోయాక చంద్రబాబు పన్నిన ఏ వ్యూహం కూడా సరైన ఫలితాలు ఇవ్వలేదు. అలాగే ఇదికూడా తుస్సుమనడం తథ్యం. రాజకీయ పరిణతి మందగించిన చంద్రబాబు ప్రజలు కూడా అలాగే వున్నారని భావిస్తే తప్పు. వెన్నుపోట్లలో తనను మించిన వాడు లేడని విర్రవీగుతున్న చంద్రబాబును ప్రజలు ఇప్పటికే ఎన్నికల పోట్లతో బెంబేలెత్తిస్తున్నారు.

జనం రోజురోజుకూ రాజకీయ పరిణతి పెంచుకొంటున్నారు. అందుకే 'నేరుగా డబ్బు', 'మారిపోయాను', 'అన్నీ ఉచితం', 'రెండుకళ్ళు' లాంటి ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా ఆయన్ను చీత్కరించి డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన కాస్త కుటిల నీతులను పక్కకు పెట్టి నిజాయితీగా ఆలోచిచడం నేర్చుకుంటే, అది ఆయనకూ, వారి పార్టీకీ మంచిది.


Friday, August 3, 2012

సీమాంధ్ర మెడికిల్స్




- వైద్య విద్యలో మరో దగా
- నియోనాటాలజీలో పోరుగల్లు బిడ్డకు తీరని అన్యాయం
- మొదటి ర్యాంకర్‌ను కాదని ఐదో ర్యాంకర్‌కు సీటు
- ఉన్నది ఒకటే సీటు.. అదీ ఫస్ట్ ర్యాంకర్‌కే ఇవ్వాలి.. కానీ, నిబంధనలకు నీళ్లొదిలారు.. మంత్రి మాటకు సలాం కొట్టారు
- రాష్ట్ర కోటాను లోకల్‌గా మార్చారు
- కాకినాడ అభ్యర్థికి సీటిచ్చేశారు..!
- తెలంగాణపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వివక్ష
- మండిపడుతున్న తెలంగాణవాదులు
- ర్యాంక్ నం.1..తెలంగాణ బిడ్డకు సీటు రాలేదు
 

ఓ వైపు ఎంబీబీఎస్ సీట్ల వివాదం కొనసాగుతుండగానే.. మరో దగా..! వైద్య విద్యలోనే తెలంగాణ విద్యార్థికి తీరని అన్యాయం. మొదటి ర్యాంకు తెచ్చుకున్నా సీటు ఇవ్వని సీమాంధ్ర పెత్తనం. ఉన్నది ఒకటే సీటు..! అదీ రాష్ట్ర కోటా కింద మొదటి ర్యాంకర్‌కే ఇవ్వాలి. ఇదే విషయాన్ని ప్రకటనల్లో గుప్పించారు. కానీ, తీరా కౌన్సెలింగ్ నాటికి మొదటి ర్యాంకర్‌కు మొండి చేయి చూపారు..! లోకల్ కోటా కింద ఐదో ర్యాంకర్‌కు సీటిచ్చి తమ సీమాంధ్ర పైత్యాన్ని ప్రదర్శించారు. మొదటి ర్యాంకర్ తెలంగాణ బిడ్డ కావడమే వారికి గిట్టలేదు..! అందుకే, మొదటి ర్యాంకర్‌ను కాదని.. ఐదో ర్యాంకర్(కాకినాడ వాసి)కు సీటు కట్టబెట్టి మరోసారి తెలంగాణపై విషాన్ని కుమ్మరించారు. వైద్య విద్యలోని నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సుల్లో చోటుచేసుకున్న ఈ తాజా తతంగం సీమాంధ్రకు చెందిన మంత్రి సమక్షంలోనే నడిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాండూరు, ఆగస్టు 2 (టీ మీడియా): సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా విద్యలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి తాజా ఉదాహరణ.. వైద్యవిద్యలోని నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సుల ఉదంతం..! కొత్తగా ఈ ఏడాది ప్రారంభించిన ఈ వైద్యవిద్య కోర్సులో ఏడాదికి ఒక అభ్యర్థినే ఎంపిక చేసి కోర్సు కాలంలో రూ. 3 కోట్ల వరకు నిధులను ఆ అభ్యర్థి చదువుకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షలో తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొత్త రాకేష్ మొదటి ర్యాంక్‌ను తెచ్చుకున్నారు. ఈయన రంగాడ్డి జిల్లా తాండూరు జిల్లా ఆస్పత్రిలో పీడియాట్రిషన్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సూపర్‌స్పెషాలిటీ కోర్సులకు సంబంధించి 2012-13 అకడమిక్ ఇయర్ సెషన్‌కుగాను జూలై 18న విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీలో నిర్వహించిన నియోనాటాలజీ (డీఎం) పరీక్షకు రాష్ట్రం నుంచి దాదాపు 50 మంది పోటీ పడ్డారు.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (విజయవాడ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్ కొత్త రాకేష్‌కు 67 మార్కులతో మొదటి ర్యాంకు వచ్చింది. 2వ, 4వ ర్యాంకులు కూడా ఉస్మానియా వర్సిటీ విద్యార్థులే దక్కించుకున్నారు. 3వ ర్యాంకు మాత్రం ఇతర రాష్ట్రానికి చెందిన అభ్యర్థికి దక్కింది. నియోనాటాలజీ సీటు రాష్ట్ర కోటా కిందికి వస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థి అయినా సరే మొదటి ర్యాంకు సాధిస్తే... ఆ విద్యార్థికే ఆ ఒక్క సీటూ ఇవ్వాలి. కానీ, సీమాంధ్ర పెత్తనం పైత్యంగా మారింది. తెలంగాణపై వివక్ష కట్టలు తెంచుకుంది. అంతే, నిబంధనలకు నీళ్లొదిలారు. వైద్య విద్యలో మరోసారి సీమాంధ్ర జులుం ప్రదర్శించారు. మొదటి ర్యాంకు తెచ్చుకున్న కొత్త రాకేష్‌ను కాదని, 5వ ర్యాంకు పొందిన ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఓ అభ్యర్థికి సీటు కేటాయిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్ణయం తీసుకుంది. మొదటి ర్యాంకర్ అభ్యర్థిని విస్మరించి కేవలం లోకల్ అభ్యర్థి అన్న కారణంతోనే ఆంధ్రా ప్రాంతానికి చెందిన 5వ ర్యాంకర్‌కు నియోనాటాలజీ (సూపర్‌స్పెషాలిటీ కోర్సు) లో ప్రవేశం కల్పించారు.

రాష్ట్ర కోటా కింద ఉన్న సీటును... లోకల్ కోటా కిందికి మార్చడం.. అదీ ఐదో ర్యాంకర్‌కు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లు తనకు జరిగిన అన్యాయంపై రాకేష్ మండిపడుతున్నారు. మొదటి ర్యాంక్ సాధించిన తనను కాదని, ఐదో ర్యాంకర్‌కు సీటు ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని గురువారం ‘టీ మీడియా’తో రాకేష్ పంచుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరీక్షలు రాసినవారిలో కేవలం మొదటి మూడు ర్యాంకులను సాధించినవారినే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌కు అధికారులు నామమాత్రం గానే పిలిచి పంపారని తెలిపారు. 5వ ర్యాంకర్‌కు సీటు కేటాయించామని, లోకల్ అభ్యర్థి కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తమకు తెలిపారని రాకేష్ చెప్పారు. డీఎం కోర్సులను వైద్య విద్యా పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర కోటాగా తప్ప లోకల్‌గా నిర్ణయించడం వివక్షేనని వైద్య వర్గాలు అంటున్నాయి.

సీమాంధ్రకు సీటు వెనుక మంత్రి..!
రాష్ట్రంలో కొత్తగా 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచే నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏటా ఒకే ఒక అభ్యర్థికి నియోనాటాలజీ విభాగం సూపర్‌స్పెషాలిటీ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సును నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ ఒక్క అభ్యర్థిపై దాదాపు రూ. 3 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది. ఈ కోర్సుకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మంత్రి ప్రమేయం వల్లే వరంగల్ జిల్లాకు చెందిన మొదటి ర్యాంకర్ కొత్త రాకేష్‌ను కాకుండా కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు చెందిన 61 మార్కులతో 5వ ర్యాంకు పొందిన ఆంధ్రాయూని వర్సిటీ అభ్యర్థిని వివక్ష పూరితంగానే ఎంపిక చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Curtesy: Namaste Telangana