Monday, December 31, 2012

నిత్య అసత్యవాది


డిసెంబరు 28న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాపై స్పష్టత ఇచ్చామని చంద్రబాబు, తెలంగాణా తమ్ముళ్ళు జబ్బలు చరుచు కుంటున్నారు. వీరు చెప్పే మాటల్లో నిజమెంతో పరిశీలిద్దాం.

అసలు ఈ అఖిలపక్ష తంతు మొదలైంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ నుంచే. తెలంగాణలో 'వస్తున్నా మీకోసం' కొనసాగాలంటే ఆ పార్టీకి తెలంగాణా ఏర్పాటు పై లేఖ ఇవ్వాల్సిన అవసరం ఎదురైంది. దానికి అనుగుణంగానే బాబు తెలంగాణలో అడుగు పెట్టే లోగా తెలంగాణా ఏర్పాటును బలపరుస్తూ కేంద్రానికి లేఖ రాస్తారని తెలంగాణాకు చేనిడిన ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తూ వచ్చారు. 

తీరా లేఖ ఇచ్చేనాటికి అది కాస్తా తెలంగాణా ఏర్పాటును బలపరిచేదిగా కాక, 'అఖిలపక్షం ఏర్పాటు చేయండి, స్పష్టత ఇస్తాం' అని చెప్పటంతో సరిపెట్టారు. ఈ మాత్రం దానికి లేఖ ఎందుకు? అని అప్పుడే అంతా ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం వారు మాత్రం 'అఖిలపక్షం ఏర్పాటు చేసి తెలంగాణా తుట్టెను కదిలించే ధైర్యం కాంగ్రెస్ కు ఎలాగూ లేదు, దాన్ని మనం కాష్ చేసుకుని తెలంగాణా పాదయాత్ర పబ్బం గడుపుకోవచ్చు' అని భావించారు. కాని, FDI ల పుణ్యమా అని కాంగ్రెస్ ఎంపీలు బెట్టు చేయడం, వారిని బుజ్జగించడానికి కేంద్ర హొమ్ మంత్రి అఖిల పక్షం ఏర్పాటు చేయడం వెంట వెంటనే జరిగి పోయాయి. దీంతో తెలుగు దేశానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.

దీన్నుంచి బయట పడడానికి, అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పాలా అని నిర్ణయించడానికి రెండు ప్రాంతాల నాయకులతో చర్చలు జరిపాడు బాబు. అఖిలపక్షం ఏర్పాటు చేయమని డిమాండు చేస్తూ అప్పుడు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తామని చెప్పినప్పుడు, మరొకసారి తమ నాయకులతో చర్చలు జరపాల్సిన అవసరం ఏంటి? అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి వుండాలి కదా?

ఆ సమావేశానికి పరమాందయ్య శిష్యుల్లాగా బాబు సీల్డ్ కవర్ను ఇద్దరు నాయకులు మోసుకు వెళ్లారట! కొండంత రాగం తీసి పిల్లికూతలు పాడినట్టు, ఆ ఉత్తరంలో బాబు వీరు చెప్పిందేమిటి? 2008లో ప్రణభ్ ముఖర్జీకి ఇచ్చిన ఉత్తరాన్ని వెన్నక్కు తీసుకోలేదట! 

ఆ ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదని ఎవరికీ తెలువదా? టెక్నికల్ గా వెనక్కి తీసుకోక పోవచ్చు, కాని డిసెంబరు 2009లో అసెంబ్లీలో, అఖిలపక్షంలో  తెలంగాణా ఏర్పాటుకు మద్దతు ప్రకటించి, 2009 డిసెంబరు 9న ప్రకటన రాగానే 10నాడు ప్లేటు ఫిరాయించిన కారణంగానే గదా మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది? అప్పుడు సమైక్య వాదాన్ని సమర్ధించి, చావుదెబ్బ తిన్న తర్వాత తిరిగి 2011 మహానాడులో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ప్రవచించిన విషయం వాస్తవం కాదా? మరి అటువంటప్పుడు తాము ప్రణభ్ కి ఇచ్చిన ఉత్తరం వెనక్కి తీసుకోలేదని చెప్పడం ఎవరిని మోసపుచ్చాలని?
     
అసలు ఎప్పుడో ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదని చెప్పడం ఎందుకు? నిజాయితీ ఉంటే తెఅలంగానా ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నామని స్పష్టం గా చెప్పవచ్చుగా? అలా సమర్థిస్తున్న BJP, CPI లాంటి పార్టీలు ఎలా చెపుతున్నాయి? మరి తెలుగుదేశం పార్టీ ఉత్తరంలో అంత డొంక తిరుగుడు ఎందుకు? మోసపూరిత ఉద్దేశాలు లేకపోతే?  

నిజంగా తెలంగాణా ఏర్పాటుపై వారికి సుముఖత ఉంటే అదే విషయం స్పష్టంగా చెప్పి ఉండవచ్చు. తీరా రేప్పొద్దున కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే, 'మేం ప్రణభ్ కి ఇచ్చిన ఉత్తరాన్ని వెనక్కి తీసుకోలేదన్నాం తప్ప, ఇప్పుడు సమర్థిస్తున్నామని చెప్పామా?' అని మరో సారి ఫిరాయించడానికి వెసులుబాటు కల్పించు కోవడం కాదా ఇది? అసలు స్పష్టంగా ఉత్తరం ఇచ్చినప్పుడే మాట తప్పగా లేనిది, ఇంతటి డొంక తిరుగుడు మాటలు చెప్తుంటే మాట నిలబెట్టుకుంటారని నమ్మేదేట్లా? 
 
చంద్రబాబు ట్రాక్ రికార్డు చూస్తే, మాట తప్పి మడమ తిప్పడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని ఇట్టే అర్థమవుతుంది. సబ్సిడీలు వద్దని, తర్వాత అన్నీ ఫ్రీగా ఇస్తానని, బెల్టు షాపులు తానే పెట్టి, ఇప్పుడు తీసేస్తానని, తెలంగాణా వద్దని, మళ్ళీ కావాలని, మళ్ళీ సమైక్యత అని, రెండుకళ్ళు అని... ఉదాహరణలు ఎన్నో. ఇంతటి నిత్య అసత్యవాది ఇప్పుడు తెలంగాణాకు సపోర్టు చేస్తాడని ఎవరూ అనుకోవడం లేదు.  ఆ మాటలతో తెలంగాణా ప్రజలను మరొకసారి మోసగిస్తామని భావిస్తే అంతకు మించిన తెలివితక్కువ తనం మరొకటి వుండదు.       

Saturday, December 22, 2012

దళితవాదమా? సమైక్యతా రాగమా?




కొండా సురేఖ, మోత్కుపల్లి నర్సింలు, తూర్పు జయప్రకాష్ రెడ్డి లాంటోల్లు పైకి తామే నిఖార్సైన తెలంగాణా వాదులమని చెప్పుకుంటూ, KCRని TRSని రోజుకు పది సార్లు దుమ్మెత్తి పొస్తుంటరు. వాళ్ళు పక్కా రాజకీయ అవకాశ వాదులు. వారి వారి సీమాంధ్రకు చెందిన నాయకుల చేతిలోని కీలు బొమ్మలు. TRSనో, KCRనో తిడితే తప్ప వారి పార్టీలో వారికి గుర్తింపు ఉండదు. కాబట్టి వాళ్ళ మాటలను గాలికి వదిలెయ్యొచ్చు.

స్వయంగా ప్రొఫెసర్ అయివుండి, స్వయం ప్రకటిత దళితవాది అయిన కంచె అయిలయ్య లాంటి వాళ్ళు రాజకీయ బ్రోకర్లకన్నా హీనంగా అమ్మనా బూతులు తిడుతుంటే పట్టించుకోకుండా వుండడం సాధ్యం కాదు. పేరుకు తెలంగాణా వాద సంస్థ నొకదాన్ని పెట్టుకొని తెలంగాణా కోసం ఏమాత్రం పాటుపడని ఒకానొక గజ్జెల కాంతం అనే అనబడే ఆయన పెట్టిన సమావేశానికి ఈ మధ్య ఐలయ్యగారు వెళ్ళారట. ఆయన తెలంగాణా సాధనకోసం సూచనలు సలాహాలు ఏమీ ఇయ్యలేదు కానీ, TRSను, KCRను తిట్టెటందుకు మాత్రం తన ఉపన్యాసాన్ని వాడుకున్నడు.

తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి KCR 50000ల కోట్లు సంపాయించుకున్నడట! మరి అంతటి రహస్యం ఆయనకే తెలిసినప్పుడు dis-proportionate assets క్రింద కోర్టులో కేసు వేయొచ్చుగా? ఆధారాలు లేని మాటలు చెప్పి ప్రచారం పొందే అణా కానీ రాజకీయ నాయకునికి, ఈ మేధావి(?)కీ గల తేడా ఏమిటి? మహామహులైన ములాయం, మాయావతి, మన రాష్ట్రంలో జగన్ లాంటి వారిని CBI కేసుల్లో ఇరికించి ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్, ఒక్క రూపాయి కేసులో ఇరుక్కున్నా KCRని ఊరికే వదిలి పెడుతుందా?

ఇకపోతే KCR ఇంట్లో ఎవరూ ఎందుకు ఆత్మ హత్యలు చేసుకోవడం లేదని అడగడం ఆయన దిగజారుడు తనానికి మరో నిదర్శనం. ఆత్మ హత్యలు ఎవరు చేసుకుంటారు? బలహీన మైన మనస్తత్వం గలవారు తెలంగాణా రాదేమోనన్న తీవ్రమైన నిరాశా నిస్ప్రుహలకు గురైనప్పుడు, లేదా ధైర్యవంతులైనా, సమాజానికి ఒక బలమైన message ఇవ్వాలె ననుకున్నప్పుడు ఆత్మ హత్యలకు ఒడిగడుతున్నారు. వారు ఏవిధంగా ఆత్మహత్య చేసుకున్నా తెలంగాణా వాదులు వాటిని సమర్థించడం లేదు. పైగా "ఆత్మహత్యలు వద్దు, నిలబడి పోరాడండి" అన్న పిలుపు నిస్తున్నారు. కాని దానికి విరుద్ధంగా వున్న ప్రొఫెసరు మాటల్లోని ఔచిత్యమేంటో చెప్పడానికి PhDలు అవసరం లేదు, తెలంగాణాలోని స్కూలు పిల్లవాడు చాలు.

ఇక పోతె ఆయన ముఖ్యమైన ఆరోపణ తెలంగాణ వస్తే వెలమ కులం బలపడుతది అనేది. కంచె ఐలయ్యో, గజ్జెల కాంతమో తప్ప సిసలైన తెలంగాణా వాదులెవరూ ఇప్పుడు తెలంగాణాల కులాల గురించి ఎవ్వరూ ఆలోచిస్త లేరు. అందరి మనసులల్ల తెలంగాణా ఎట్ల వస్తది అన్న ఆలోచన మాత్రమే వున్నది. ఇంక ఈయన ఆరోపణలల్ల నిజమెంతో చూద్దాం.

తెలంగాణాల రెడ్లకంటే బలమైన కులమేమీ కాదు వెలమ. తెలంగాణా రెడ్లు కూడా రాయలసీమ రెడ్ల వంటి బలవంతులూ, ఫ్యాక్షనిస్టులూ కారు. ఇక పోతే మూడో అగ్రకులమైన కమ్మ తెలంగాణాలో నామమాత్రం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? తెలంగాణా రాష్త్రం వస్తే అగ్ర కులాలు కాకుండా BC, SC, STలు బలపడే అవకాశం వుందని కదా? ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాజలసీమ రెడ్డి, ఆంధ్ర కమ్మ కులాల గుప్పిట్లో వుంది. తెలంగాణా గనుక విడిపోతే, ఇతర కులాల జనాభా ఎక్కువ కాబట్టి వారికి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

ఒకవేళ రాష్ట్రం ఇప్పుడు ఏ దళిత బహుజనుల చేతిలోనో వుండి వుంటే, రేపు తెలంగాణా వస్తే వెలమల చేతిలోకి వెలుతుందేమో, ఎలా? అని ఆలోచించడంలో అర్థం వుంది. కాని రాష్ట్రం ఏర్పడ్డ యాభయ్యేడు సంవత్సరాల్లో ఏనాడూ రాజకీయంగా వారి ఆధిక్యత కనపడలేదు. ఈ రాష్ట్రం ఇలాగే వుంటే మరో యాభై ఏళ్ళ తర్వాత నైనా ఆంధ్రా కమ్మ, రాయలసీమ ఫ్యాక్షన్ రెడ్ల హస్తాల నుండి బయట పడుతుందన్న నమ్మకం అసలే లేదు.

KCR అగ్రకులంలో పుట్టడం ఆయన తప్పు కాదు. కంచె ఐలయ్య కేవలం దళిత కులంలో పుట్టినందుకే దళితవాది అయ్యాడా, లేక దళితులపై జరుగుతున్న అత్యాచారాలను సహించలేక దళితవాది అయ్యాడా అన్నది ఆయన ఆలోచించు కోవాలి. దళితులపైన జరుగుతున్న అత్యాచారలపై స్పందించి పోరాడడానికి దళితుడే కానవసరం లేదు.

అలాగే తెలంగాణా పోరాటం కూడా తెలంగాణాపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా, తెలంగాణా అస్తిత్వం కోసం జరుగుతున్న పోరాటం. ఈ రెండు పోరాటాలు ఒకదాన్ని ఒకటి పరస్పరం గౌరవించుకుంటూ జరుగ వలసిన పోరాటాలు. రెండింటి లక్ష్యం ఒక్కటే, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక దోపిడీని వ్యతిరేకించి పోరాడడం. నిజమైన దళిత వాది తెలంగాణా వాది కాకుండా వుండలేడు, అలాగే నిజమైన తెలంగాణా వాది దళితవాది కాకుండా వుండలేడు.

ఐలయ్య లాంటి వాళ్ళు పనిగట్టుకొని KCRని విమర్శించడం వల్ల బలపడేది దళిత వాదం కాదు, సమైక్యవాదమే అని గుర్తించాలి. KCR నాయకత్వం వల్ల వెలమల అధికారం ఏ రూపం తీసుకుందనేది ప్రస్థుతం ఊహాజనితమైన విషయం. కాని ప్రస్థుతం నడుస్తున్న కమ్మ, ఫ్యాక్షనిస్టు రెడ్ల పాలనలో కనిపిస్తున్న చుండూరు, కారం చేడు, లక్షింపేటల విముక్తి గురించి ముందు ఆలోచించాలి. తెలంగాణా ఏర్పడితే నిశ్చయంగా అది దళిత బహుజనుల రాజకీయాధిఅకానికి దోహద పడుతుంది. తద్వారా సోదర ఆంధ్రా ప్రజలకు కూడా ప్రేరణ కల్పిస్తుంది. ఆ విషయం ఆంధ్రాలోని దళిత సంఘాలు ఎప్పుడో గుర్తించాయి, ఐలయ్య లాంటి జడ వాదులు తప్ప.

Saturday, December 15, 2012

కాంగ్రెస్ తెలంగాణా వ్యతిరేకతకు కారణం ఏమిటి?

మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదని తేలి పోయింది. ఇప్పటిదాకా రాష్ట్ర, కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెపుతున్నా, వచ్చే ఎన్నికల లోపు కాంగ్రెస్ ఏదో ఓక నిర్ణయం తీసుకుంటుందని ఏమూలో ఒక చిన్న ఆశ. దానికి కారణాలు లేక పోలేదు. సీమాంధ్ర లో రోజు రోజుకి దిగజారుతున్న దాని పరిస్థితి, ఒక వేళ తెలంగాణాపై నిర్ణయం తీసుకుంటే కనీసం ఆ ప్రాంతంలో నిలదొక్కుకునే అవకాశం. కాని, మొన్న కేంద్ర హొమ్ మంత్రి అఖిల పక్ష సమావేశానికి పిలుస్తూ ఇచ్చిన లేఖని చూసిన తర్వాత కూడా ఎవరైనా ఆ పార్టీ తెలంగాణాను ఇస్తుందని నమ్మితే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.

కాంగ్రెస్ తెలంగాణాను ఇలా వెన్నుపోట్లు పొడవడం ఇది మొదటిసారి కాదు. గొప్ప ప్రజా చైతన్యంతో నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం జరిగి, నిజాంని మట్టి కరిపించే తరుణంలో పోలీస్ యాక్షన్ ప్రకటించి, అదే నిజాంని 'రాజ బహద్దూర్' చేసి, భరణం ఇచ్చి సాగానంపినప్పుడే నెహ్రూ, పటేల్ తెలంగాణా వెన్నులో మొదటి గునపాన్ని దింపారు. అది మొదలుగా కాంగ్రెస్ పార్టీ మోసాల పరంపర కొనసాగుతూనే వుంది.

1956లో విశాలాంధ్ర ఏర్పాటు చేసినప్పుడూ అదే తంతు. ఆ తర్వాత మోసాలూ, ఒప్పందాల ఉల్లంఘనలూ, 1969లో తెలంగాణా ఉద్యమం అణచివేత, మొన్నటికి మొన్న 2009లో ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోవడం... ఇలా ఒకటేమిటి? తెలంగాణాకు కాంగ్రెస్ చేసిన ద్రోహాలు చెప్పితే తరిగేవి కాదు. కాంగ్రెస్ చేసిన ఈ ఘనకార్యాలకు ఈ ప్రాంతంలో ఆ పార్టీ భూస్థాపితం కాకుండా తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక చివరి అవకాశం, అధికారంలో ఉండగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయడం.

కాని దానికి ఆ ఉద్దేశం ఏమాత్రం లేదని కొత్తగా ఇచ్చిన లేఖతో బయట పడింది. ఎంపీలు కోరారు కాబట్టి సమావేశం ఏర్పాటు చేస్తుందట. చర్చలను తిరిగి పునరుద్ధరిస్తుందట! తెలంగాణా ప్రజలను ఆ పార్టీ ఎంత చులకనగా చూస్తుందో  ఈ రెండు వాక్యాలు చూస్తే చాలు, తెలిసి పోతుంది.

తెలంగాణా ఇవ్వడం వల్ల తెలంగాణలో బలపడుతానని తెలుసు, ఆంధ్రాలో చెప్పుకోదగ్గ తేడా రాదనీ తెలుసు. బయటికేం చెపుతున్నా, తెలంగాణా ఇచ్చినా.., ఇవ్వకపోయినా దేశ వ్యాప్తంగా జరిగే మార్పులేమీ ఉండవని కూడా తెలుసు. భారత దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా తెలంగాలో ఉద్యమాలు జరుగుతున్నాయని కూడా తెలుసు. మరి ఏ నష్టం లేనప్పుడు, పైగా ఏంతో  కొంత లాభమే ఉన్నప్పుడు, ఆ పార్టీ తెలంగాణా ఏర్పాటుకు ఏందుకు సుముఖత చూపడం లేదు? ఇది  ప్రతి తెలంగాణా పౌరుడి మదిలో మెదిలే ప్రశ్న.

అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్న వారికి అది సులభంగానే అర్థమౌతుంది. ఇందిరాగాంధీ మరణం వరకూ కాంగ్రెస్ అమెరికానూ, మార్కెట్ విధానాలనూ ఎదిరించేదిగా పేరు తెచ్చుకుంది. రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అది తన దిశను మార్చుకొని, వరల్డ్ బ్యాంకు, అమెరికాల అడుగులకు మడుగులొత్తడం మొదలు పెట్టింది.

ఆ కారణంగానే దేశం మొత్తం వద్దని మొత్తుకున్నా, ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో వున్నా, అణు ఒప్పందాన్ని పార్లమెంటులో నెగ్గించుకుంది. దానికోసం కోట్లు కుమ్మరించి  ఎంపీలను కొనడానికి కూడా వెనుకాడలేదు. అలాగే వాల్ మార్టు వ్యవహారం కూడా. అదే సమయంలో మహిళా బిల్లు, జన లోక్ పాల్ బిల్లుల కోసం దేశ వ్యాప్తంగా ఎంత వత్తిడి వచ్చినా పట్టించు కోలేదు. ఇక తెలంగాణా సంగతి సరే సరి.

దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ అమెరికాకు, అంబానీలకు మాత్రమే జవాబుదారీ తప్ప, ఈ దేశ ప్రజలకు కాదని అర్థం కావడం లేదూ? మార్కెట్ శక్తులు ఆజ్ఞాపిస్తే కాంగ్రెస్ నిముషాల్లో తెలంగాణా ఇస్తుంది. కానీ అలా జరగడం లేదు... కారణం ఏమిటి?

తెలంగాణా రైతాంగ పోరాటం నుండి ఇప్పటివరకూ తెలంగాణా ప్రజలు మార్కెట్ భావ జాలానికి వ్యతిరేకం. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే స్వభావం అసలే కాదు. మరి ఇలాంటి ప్రజల చేతుల్లో ప్రపంచ ప్రసిద్ధ మార్కెట్లలో ఒకటైన హైదరాబాదును ఎలా పెడతారు? చూస్తూ చూస్తూ అంత పెద్ద మార్కెట్ ను శాసించే అవకాశాన్ని మార్కెట్ శక్తులు వదులుకుంటాయా?

కాబట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణా రాదని స్పష్టమైంది. అదే విధంగా రేపు మరో కూటమి కేంద్రంలో అధికారం లోకి వచ్చినా, అది కూడా మార్కెట్ శక్తులకు ఊడిగం చేసే అవకాశం వుంది. అలాంటి పార్టీలు ఇప్పుడు ఏమి చెప్పినా, తర్వాత ఇచ్చిన వాగ్దానాలను అవే మార్కెట్ శక్తుల ఆదేశాల మేరకు తుంగలో తొక్కవని అనుకోలేం.

ఉద్యమాలతో తెలంగాణా సాధించాలని కొందరి వాదన. ఉద్యమాలతో తెలంగాణా వచ్చే అవకాశమే వుంటే అది ఇప్పటికే వచ్చి వుండాలి. ఒక్క సాయుధ పోరాటం తప్ప తెలంగాణా ప్రజలు ఇప్పటికే అన్ని రకాల ఉద్యమ రీతులను ఇంతక ముందు దేశంలో ఎక్కడా కనీ, వినీ ఎరుగని రీతిలో చేసి వున్నారు. ఇప్పుడు మరి కొన్ని ఉద్యమాలు చేసినా అవి బలమైన శత్రువు ముందు ఏమాత్రం పనిచేయవని లోక్ పాల్, వగైరా ఉదంతాలు ఈ పాటికే తేట తెల్లం చేశాయి. ప్రజలు ఉద్యమాలు చేసిన కొద్దీ, ప్రభుత్వం మరిన్ని అధునాతన ఆయుధాలు దిగుమతి చేసుకొని మరింత నైపుణ్యంగా వాటిని అణచి వేస్తుందే తప్ప, ప్రజల కోరిక నేరవేర్చుదామనే ఆలోచన చేయదు.

కాబట్టి  రాష్ట్ర సాధన కోసం తెలంగాణా ప్రజలు ముందు రాజకీయంగా బలపడాలి. నిఖార్సైన తెలంగాణా వాదులను అత్యధికంగా పార్లమెంటుకి, అసెంబ్లీకి  గెలిపించడం ద్వారా, రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించ గలిగినప్పుడే ఆ అనివార్యత సాధ్యం అవుతుంది. ఎదురు నిలిచి పోరాడే వాడికి కట్టెనిచ్చి, పారిపోయే వాడికి కత్తి నివ్వడం వలన ఉపయోగం లేదు. కాబట్టి పన్నెండేళ్ళుగా నిబద్ధతతో తెలంగాణా ఏర్పాటుకోసం ఉద్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకున్న కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణా రాష్ట్ర సమితిని అత్యధిక సీట్లలో గెలిపించడం ఒకటే ఇప్పుడు తెలంగాణా ప్రజల ముందున్న మార్గం. అంతకు మించిన మార్గం లేదు.








Tuesday, December 11, 2012

అవ్వా, బువ్వా రెండూ దక్కవు


తెలంగాణా అంశం దిల్లీలో ఊపందుకున్న ప్రతిసారీ ల్యాంకో హిల్సులో ఫ్లాట్లమ్ముకునే వ్యక్తికి గుండె దడ పెరుగుడు మొదలైతడి.  ఏ హోం మంత్రో, ప్రధాన నేతో, తెలంగాణా పై ఒక విధాన ప్రకటన చేయంగనే ఫ్లాట్ల రేటు తగ్గుతదేమోనని గాయినకు ఎక్కడ లేని భయమైతది. హుటాహుటిన ఫ్లైట్లల్ల సూటు కేసులు మారుతై. ఏం జరుగ లేదన్నట్టు ఒక డిల్లీ గులాం తొండి మాటలు మాట్లాడుడు శురూ జేస్తడు.

మూడేండ్ల నుండి ఇదే కథ నడుస్తుంది. తెలంగాణా పోరాట శక్తుల పట్టుదలో, తె.కాంగ్రెస్  ఎంపీల బెట్టుదలో, మొన్న FDI ల పుణ్యమా అని అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకు హోమ్ మంత్రి ద్వారా ప్రకటన వచ్చింది. అంతలోనే దాన్ని నీరు గార్చుడు మొదలైంది. గులాం గులాంగిరీ, ముఖ్యమంత్రి వాయిదా అభ్యర్ధన, హోం మంత్రి ఎంతమందయినా రావచ్చు... అనుకుంట ప్రకటనల శర పరంపర మొదలైంది.

ఈ మాత్రం దానికే స్వర్గాన్ని భూమ్మీదకు దించినట్టు ఉబ్బి తబ్బిబ్బవుతున్న తెలంగాణా కాంగ్రెస్ ఏమ్పీల్లారా, గత ఎనిమిదేళ్లుగా అణుశక్తి బిల్లు, అవిశ్వాస తీర్మానం, లోకపాల్ లాంటి అవకాశాలను సద్వినియోగ పరచుకొంటే, ఈపాటికి తెలంగాణా వచ్చేసుండేది.

కనీసం ఇప్పటికైనా మీరు బెట్టు దిగకుండా సక్రమంగా అఖిలపక్షం జరిగేటట్టు చూడండి. ఇప్పటికే షిండే సమావేశానికి ఒక్కరైనా రావచ్చు, ఎందరైనా రావచ్చు అని మొండి మాటలు మాట్లాడుతున్నడు. పార్టీకి ఒకరు మాత్రమె వచ్చి ఒకే అభిప్రాయం ఇచ్చేటట్టు మీరు జాగ్రత్త పడకుంటే, జనానికి మీ మీద ఉన్న కాస్త నమ్మకం కూడా సడలుద్ది. అధిష్టానం ఆడే డ్రామాల మీ పాత్ర ఉన్నదా, లేదా అనేది మాకు అనవసరం. మీ నిష్క్రియాపరత్వం చూస్తున్న వాళ్లకు మీరు కూడా పాత్రధారులే నాన్న నమ్మకం కలుగక మానదు.

అట్లా జరుగొద్దనుకుంటే, మీ చిత్తశుద్ధి ప్రజలకు నిరూపించాల్నంటే, మీరు తీసుకున్న మార్గంలో ధైర్యంగా ముందుకు నడవడమే మీకున్న మార్గం. మధ్యలో వదిలేస్తిరా, మీకు అవ్వా, బువ్వా రెండూ దక్కవు.  

Wednesday, December 5, 2012

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు


ఇప్పుడున్న పరిస్తితులల్ల 2014 లోపు తెలంగాణా రావాలె నంటే ఒకటే మార్గం. అది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వాళ్ళ అధిష్టానం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుక రావడం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలను పట్టించుకుంట లేదు. ప్రజల ఆకాంక్షల కన్నా సీట్ల లెక్కలే దానికి ముఖ్యమై పోయినై. అసుమంటి పార్టీకి అదే తరీకల బుద్ధి చెప్పాలే. సీట్ల లెక్కలు చేసుకొనే పార్టీకి గా సీట్ల లెక్కలే తారుమారు చెయ్యాలే. అది 2014 ల ఎట్ల నైనా చేస్తం, తెలంగాణా ఇయ్యక పొతె. కాని గాపని ఇప్పుడే కావాలె నంటె మాత్రం అది కాంగ్రేస్ పార్టీ నాయకుల తోనే సాధ్యం.

తెలంగాణా వాదులమని చెప్పుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా ప్రజలని మభ్య పెట్టుడు మానేయ్యాలే. వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదిగో తెలంగాణా, అదిగో తెలంగాణా... అమ్మ పలుకుతది... అనుకుంట కాలం వెళ్లదీస్తున్నరు. అయితే గీ శీతాకాల సమావేశాలు అయిపోతే, ఇంక తెలంగాణా మాట వచ్చుడు కష్టం. ఒకవేళ ఇద్దామనుకున్నా వచ్చే ఎన్నికల లోపల అది అసాధ్యం.  కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఒక మూలకు నెట్టి వేయ బడ్డరు. ఇంక అక్కడి నుండి వాళ్లకు తెలంగాణా తెచ్చుడు తప్ప వేరే దారి లేదు.

కాబట్టి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడే తమ పార్టీ అధిష్టానం మీద గట్టి వత్తిడి తీసుక రావాలె. రాజీనామాలకు కూడా  సిద్ధపడి రాజీలేని పోరాటం చేస్తే తప్ప అలాటి వత్తిడి పనిచెయ్యదు. సోనియా ముందట చేతులు కట్టుకొని మోకరిల్లితే అది సాధ్యం కాదు. అమ్మ మెప్పుకోసం వాళ్ళు తెలంగాణనే పణంగ పెడుతరా అంటే అది వాళ్ళ ఇష్టం. అట్ల గనుక జరిగితే వాళ్ళను బొంద పెట్టేతందుకు ప్రజలు సిద్ధంగ ఉన్నరు. ఇక నిర్ణయించు కొనుడు వాళ్ళ వంతే.

ఇంక కొంతమంది జగన్ పార్టీ దిక్కు చూస్తున్నరట.గట్ల చూసే నాయకుల చరిత్రలు మనకు తెలువనియి కావు. వాల్లకు రాజకీయమంటే డబ్బు, డబ్బంటే రాజకీయం. జగన్ ఇచ్చే పైసలతోని ఎన్నికలల్ల గెలుస్తమని వాళ్ళు అనుకుంటుండొచ్చు. అది కేవలం వాళ్ళ భ్రమ. మూడేండ్ల కిందనే కోట్ల రూపాయలు మంచినీళ్ళ లెక్క కర్చు పెట్టిన డి. శ్రీనివాస్ కి ఏ గతి పట్టిందో వాళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలె.

ఇప్పుడు ఇక్కడి ప్రజలకు తెలంగాణా ఆకాంక్ష ఒక్కటే తప్ప ఇతర ప్రలోభాలు ఎన్ని చేసినా అవి ప్రభావం చూపవు. తెలంగాణా మేమే ఇస్తామని చెప్పి ఇన్నొద్దులు సుద్దులు చెప్పుకుంట పబ్బం గడుపుకున్నరు అన్ని పార్టీ లోల్లు. కాని ఇంకా గయ్యే మాటలు చెప్తమంటే మటుకు జనం నమ్మే పరిస్తితిల లేరు. చెంద్రబాబు కళ్ళు పోసి బీడీ ముట్టిచ్చినా, విజయమ్మ దొంగేడుపు లేడ్చినా, శర్మిలమ్మ నంగి మాటలు చెప్పినా... ప్రయోజనం శూన్యం.

అయితే ప్రజల కోరికలు ఎట్లున్నా, సీమాంధ్ర పెట్టుబడిదారీ, దోపిడీ, ఫ్యాక్షన్ శక్తులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రాంగ, అధికార గణం, సీమాంధ్ర మీడియా  వగైరాలు అభిమన్యుడిని దొంగ దెబ్బ తీసిన కురవుల్లా, తెలంగాణాను చావుదెబ్బ తీయడానికి పొంచి వున్నాయి. ఇట్లాంటి శక్తుల కుయుక్తులను ఎదుర్కునే టందుకు ప్రతి ఒక్క తెలంగాణా యోధుడు అనుక్షణం అప్రమత్తంగ ఉండాలె.

Saturday, December 1, 2012

ప్రజాసమస్యలు పట్టని పాదయాత్రలు



ఇది పాదయాత్రల సీజన్. ప్రతి నాయకుడు, నాయకురాళ్ళు అనుకునేవాళ్ళు యాత్ర లు చేపడుతూనే ఉన్నారు. ఆ మొన్న ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామం నుంచి ఒక ట్రైబల్ జాదవ్ విలాస్ నాయక్ యువ నాయకుడు జోడేఘాట్ దగ్గర నుంచి బతికుండి తెలంగాణ కోసం పోరాడాలి, బలిదానాలు సరికాదని ఆత్మహత్యలకు వ్యతిరేకం గా తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నానని చెప్పినప్పుడు ఆశ్చర్యపోవాల్సివచ్చింది. ఆయన గురించి ఎవరూ రాయరు. రాసినా ఎవరు చదవరు. ఆయన వెనుక ఒక పార్టీ కాని, అతని తండ్రి, అన్న, మామ ఎవరూ కూడా అతి పెద్ద పదవులు అనుభవించిన వారుకాదు. వారి గురించి అక్కడా ఇక్కడా రెండు ముక్కలు జిల్లా పేజీల్లోనో వేస్తే తప్పా తెలిసే అవకా శం లేదు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ఒక ప్రభుత్వ టీచర్, ఎరుకల కులస్థుడు, సురపరశురాం తెలంగాణ వచ్చేదాకా పండుగలు చేసుకోవద్దనిపతి పండుగకి భార్య, కుమారునితో ఊరి చౌరస్తాలో దీక్ష చేస్తున్నడు. ఆయన గురించి ఎంతమందికి తెలుసు? కొంతమంది జిల్లా వారికి మాత్రమే తెలిసి ఉండవచ్చు.

ఇదే పరిస్థితి కాలువగట్టు మల్లన్న ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ బస్సు యాత్రకు అడుగడుగునా పోలీసువారు అడ్డుకున్నారు. నిజామాబాద్‌లో అరెస్ట్ చేశారు. అలాగే ముస్లిం సమస్యలపై అనేక సదస్సులు జరుగుతాయి. అవికూడా వార్తల్లోకి ఎక్కవు. ఇంకావిద్యార్థులు తెలంగాణ మంట ప్రజల గుం డెల్లో చల్లారకుండా ఉండడానికి బస్సుయాత్రో, పాదయాత్రో చేస్తుంటారు. అవి పెద్ద వార్తలు కావు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒక రోజు జలదీక్ష చేస్తే ఎన్ని పత్రికలు ప్రచురించాయి? కానీ షర్మిలా, చంద్రబాబు పాదయాత్రలు పతాక శీర్షిక వార్తలు అవుతుంటాయి. పవర్ యాత్రలా మజాకా! తెలంగాణ వాళ్ళయితే లెక్క వేరేవిధంగా ఉంటది. 

రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు చేయని పోరాటం లేదు. ఆఖరికి ప్రాణాలు తీసుకున్నారు. ఏఒక్క నాయకుడైనా స్పందించక పోతారా అని అన్ని ప్రయత్నాలు చేశారు. ఏలిన వారు నేను కాదు వాళ్ళు, వాళ్ళు కాదు వీళ్ళు అని కుప్పిగంతులు వేస్తున్నారు. ఇప్పుడు జరిగే యాత్రలను చూస్తుంటే ఓటు రాజకీయాల కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూస్తుంటే వీళ్లనేనా మనం నాయకులుగా ఎన్నుకున్నది అనిపిస్తుంది. తండ్రి పోయాడని జగన్‌మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసి, వారి తండ్రి విగ్రహాలు ప్రతిష్టించారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అరెస్టై జైలులో ఉన్నాడు. దీంతో జగన్ మార్క్ రాజకీయాలు ఆకాశం నుంచి ఒక్కసారి కిందికి దిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తరువాత జగన్ తల్లి విజయమ్మతో యాత్రలు చేయించారు. జగన్ అనుకున్న పాచికలు పార తెలుసుకున్నారు వారి వెనుక ఉన్న వందిమాగధులు. వెంటనే మరో పాత్రను ప్రవేశపెట్టారు.వారి పేరు షర్మిల. ’జగనన్న కోసమే నేను, అన్న కోసమే నా యాత్ర’ (పదవి కోసమే మా కుటుంబ పాట్లు అని చదువుకోవాలి) మనం. దాని పేరు ‘మరో మహాప్రస్థానం’.

యాత్ర మొదలైంది తండ్రి సమాధి ఇడుపులపాయ నుంచి. అక్కడి నుంచే సెంటిమెంట్, ఎమోషన్ పూర్తిగా దట్టించి ప్రజలను తన యాత్రకి సిద్ధం చేశారు. జగనన్న కోసం యాత్ర చేపట్టిన చెల్లిని చూసి కరిగిపోయిన జనం కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాయలసీమ యాసలో షర్మిల తెలంగాణ గడ్డ మీద మాట్లాడుతుంటే ఎంతమంది ప్రజలకు అర్థమవుతున్నదో వారే చెప్పాలి.

మీడియా ప్రచారం చూస్తుంటే చాలా వరకు వివిధ పార్టీలకు అనుగుణంగా పని చేస్తున్నాయి. కానీ ప్రజల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నాయా? మూడేళ్లుగా ప్రాణాల కు తెగించి పోరాడుతున్న తెలంగాణ సమస్యను పక్కనపెట్టి మళ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరిస్తున్నై. హర్యానాలో రెండు నెలల కిందట 20 మంది దళిత మహిళలపై రేప్‌లు, గాంగ్ రేప్‌లు జరిగాయి. ఒక తండ్రి, ఒక అమ్మాయి ఆత్మహత్యలు చేసుకున్నరు. ఒక రాష్ట్రంలో ఒక కులం మహిళలపైనే ఎందుకు జరుగుతున్నాయి అన్నది వార్త కాదు. ఎన్నోసార్లు దళిత మహిళలు సర్పంచ్‌గా ఉన్నందుకు బట్టలూడదీసి, పరేడ్ చేయించి నానా హింసలు పెట్టిన సంఘటనలు కోకొల్లలు, ఈమహిళలు దొరసానులు కారు, వారి వార్తలు ఎవరూ రాయరు, కనీసం పట్టించుకోరు. రాజకీయాలు అంటే ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజాస్వామ్యం అని ఎవరైనా పొరపడి ఉంటే ఇప్పుడు జరుగుతున్న దేశ, రాష్ట్ర రాజకీయాలను చూసి మీఅవగాహనను మార్చుకొని పుస్తకాలలో కూడా మార్పులు తేవడానికి ప్రయత్నించగలరు. ఇవి రాచరికాలు. అగ్రకుల కుటుంబ రాజకీయాలు, వారసత్వ, పదవి పోరాటాలు అని చదువుకోవాలి.

చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యంగా ఆంధ్రప్రదేశ్‌ని సైబర్‌ప్రదేశ్‌గా మార్చారు. ఇపుడు ఎటూ తేల్చుకోలేక, ఏ నిర్ణయం తీసుకోలేక అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా సతమతమవుతున్నారు. వీరి వెనుక ఉన్న తెలంగాణ తెలుగుదేశం వారికి ఇక ప్రైవేట్ సైన్యం తప్ప మరొక దిక్కులేదు. ఈసారి ఎలాగైనా పదవి చేపట్టాలని వారు పాదయాత్ర మొదలుపెట్టారు. వారు పదవి కోసం పడే పాట్లు చూస్తుంటే జనాలకు కడుపు తరుక్కుపోతున్నది. ఈ పాదయాత్రల వల్ల ఒరిగేది ఏమిటో కాస్త చదువు రాని అమాయకులకి చెబితే బాగుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడి యాత్రలో రాయలసీమ గూండాలతో వచ్చి కనపడ్డ ఉద్యమకారులపైన దాడులు చేయించారు.అదేవిధంగా విజయమ్మ సిరిసిల్ల యాత్రలో ఉద్యమకారురాలు రహీమున్నిసాపై జరిపిన దౌర్జన్యకాండ ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. తమకంటూ సొంత రక్షణ లేకుండా సీమాంధ్ర నేతపూరైనా తెలంగాణలో యాత్ర చేసే ధైర్యముందా అని ఇక్కడి ప్రజలు సవాలు విసురుతున్నారు.

కోదండరాం చంద్రబాబు నువ్వెట్ల వస్తావో చూస్తామని ఒక సవాల్ విసిరిన్రు. అనుకున్నట్లుగానే అడ్డుపడ్డరు. తెలంగాణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి చెప్పమని తెలంగాణ సంఘాలు, ప్రజలు అమాయకంగా అడుగుతుంటారు. ఎక్కడైనా జామచెట్టుకి మామిడి కాయలు కాస్తాయా? ఈ ఆంధ్రా లాబీ రాజకీయాలు తెలంగాణ తెస్తాయా? తెలంగాణ అన్న పదం వినపడకుండా ఎన్టీఆర్ కాలం నుంచి తెలుగుదేశం ఎన్ని కుట్రలు పన్నింది? ఎన్ని చట్టాలు పకడ్బందీగా చేసింది? అవన్ని ప్రజలు మర్చిపోయారా? 1972 జై ఆంధ్ర ఉద్యమంలో బాబు గారు విద్యార్థి నాయకుడు, ముల్కీరూల్స్‌ని నిర్వీర్యం చేయడానికి అవతరించిన ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి.

మామను వెన్నుపోటు పొడిచినట్టు సొంత పార్టీ నేతలే చెప్పుకున్నారు. ఆతరువాత వచ్చిన రాజశేఖర్‌డ్డి కేంద్రాన్ని తన గుప్పి ట్లో పట్టుకొని ప్రత్యేకఆర్థిక మండళ్లు కొడుక్కి, బొగ్గునిక్షేపాలు అల్లుడికి ఆస్తిగా కట్నంగా రాసి ఇచ్చారు. ఉద్యమకారుల గొంతుల్ని నొక్కలేదా? ఇవన్నీ మరిచిపోయి మనం మీరు తెలంగాణకు అనుకూలమా కాదా చెప్పండి అనడం విడ్డూరంగాఉంది. ఇన్ని చావులు, ఇన్ని ఉద్యమరూపాలు చూసి కదలని వారు ఇప్పుడు కదిలితే దాని అర్థం ఏమిటి? ఎవరికి కావాలి వీరి సానుభూతి? ఇంతకి తెలంగాణకు అనుకూలమని చెప్పి సాధించేది ఏమిటి? పోయిన ప్రాణాలు తిరిగి ఇస్తారా? పోయిన ఉద్యోగాలు, భూములు, వనరులు వస్తాయా?

కాంగ్రెస్‌లోని కొంతమంది కొత్త వేషంగట్టి తెలంగాణ కోసం పార్లమెంట్ ముందు నినాదాలిస్తున్నారు. సోనియాగాంధీ ఇంకా కరుణిస్త లేరు. కొందరు ఎంపీలు పార్లమెంట్ గుమ్మం లో భిక్షాందేహి అంటే తెలంగాణ వచ్చును. నోట్ దిస్ పాయింట్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. మీరు అనవసరంగా మీ ప్రాణాలని అర్పించకండ్రి మీ కాల్మొక్తం. కాంగ్రెస్ అనగానే ఒక జాతి, ఒక కులం అనుకునేరు. పార్టీల్లో ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ నాయకులు వేరయా! ఎంపీలు ఢిల్లీలో ఉండు ను మరి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడు జగన్ పార్టీలో దూకుదామా అని లెక్కలు వేసుకోనును, బహు ముచ్చటగా దొరికినంతా దోచుకొని మళ్లీ ఎన్నికలకు సిద్ధమగును. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఛలోక్తులు! ఇవి ఇక్కడ తెలంగాణ పాలి‘ట్రిక్స్’!

ఆ మధ్య కాంగ్రెస్‌వారు ఫ్లోరైడ్ బాధితుల కోసం ఒక యాత్ర చేపట్టి 200 కోట్ల దానం ప్రకటించారు. ఇంతవరకు దాని చడీచప్పుడు లేదు, ఈ మధ్య కాలంలో తెలంగాణ నెటిజెన్స్ ఫోరం యువత ఫ్లోరైడ్ సమస్యపై ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టింది. అప్పుడు మేము ఇక్కడి రాజకీయ పార్టీలకు, పెద్ద పెద్ద సంఘాలకు ఒక సవాల్ విసిరాము. మా జీతభత్యాలతోని, మా యవ్వన జీవితాన్ని తెలంగాణకు, ఇక్కడి సమస్యలకు కేటాయిస్తున్నాం మీరు ఏం చేస్తున్నారని? ఇన్నేళ్లుగా పదవులు అనుభవిస్తూ కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవుల ను చేపట్టిన నాయకుల దగ్గరి నుంచి నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులు ఆ ప్రాంతానికి చేసింది ఏమిటి? ఈ రాజకీయ స్వార్థ యాత్రలపై, తెలంగాణ ప్రజలు ధిక్కారగళాన్ని వినిపిస్తున్నారు. మీ యాత్రల వల్ల ప్రజలకు జరిగే లాభం ఏమీ లేదు. నిజంగా మీరు సమస్యలపై యాత్రలు చేస్తుంటే.. ఇక్క డ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై, ప్రజల జీవితాలతోని ఆడుకుంటున్న ప్రభుత్వ విధానాలపై మాట్లాడండి. లక్షింపేట, బాక్సైట్, పోలవరం, సెజ్‌లు, పోర్టుల వంటి సమస్యలపై మాట్లాడండి, పోరాటం చేయం డి. ప్రజలకు న్యాయం అందించండి. మేము తెలంగాణకు అడ్డంకాదు అంటూనే ఈ సమస్యను చాకచక్యంగా పక్కన పెడుతున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. మీ వెంట వచ్చేవాళ్లంతా మీకు ఓట్లు వేస్తారని భ్రమపడవద్దు. ఇవ్వాళ తెలంగాణలో జిల్లాకు ఒక సమస్యతో సతమతమవుతున్నది. దాని మీద నోర్లు విప్పండి. ఓపెన్‌కాస్ట్, గ్రానైట్ మైనింగ్‌ల తవ్వకాలపై మీ వైఖరి చెప్పండి. నీటిని, భూమిని పేదలకు పంచి, వనరుల రక్షణ బాధ్యత పేదలకు ఇస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా? ఒకవేళ ఉంటే ఇన్ని పాదయావూతల అవసరాలు రాక పోవచ్చు.

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Re-published from Namasthe Telangana