Wednesday, October 22, 2014

మార్క్సు చెప్పని విషయాలు



మీ కమ్యూనిస్టుల సంగతి మరీ విచిత్రంగా వుందన్నా!

ఏమయింది? బాగానే వున్నాంగా?

రాను రాను మీరు ఏ సిద్దాంతం అమలు చేస్తున్నారో తెలియకుండా వుంది.

ఇంకేం సిద్ధాంతం? మేం కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలనే పాటిస్తాం.

మార్క్స్ ఏం జెప్పాడు?

పెట్టుబడి దారుడు కార్మికుడి శ్రమను దోచుకుంటాడు. కార్మికుడి వైపు నిలిచి పోరాడాలి అని.

మరి మీరేం జెస్తున్నారు?

ఏం జేస్తున్నాం?

ఆ టీవీ చానెళ్ళ వాళ్ళూ, పత్రికాధిపతులూ ఉద్యోగుల పొట్టలు గొట్టే పనులు చేస్తుంటే, జీతాలు సగానికి సగం కోత వేస్తే అదేంటని మాట్లాడరు.

మార్క్స్ కాలంలో టీవీ చానళ్ళు లేవు. పేపర్లు ఉన్నా ఇంత పెద్ద మీడియా సంస్థలు లేవు. కాబట్టి మార్క్స్ కు వాటి సంగతి తెలియదు. ఆయన రాయకుండా మేం ఏపనీ చేయం.

సరే! మరి MSOలు ప్రసారాలు నిలిపివేస్తే పోరాడాలని చెప్పాడా మార్క్సు?

MSOల సంగతి చెప్పలేదు. కాని "పోరాడాలని" మాత్రం చెప్పాడు. కాబట్టి ఎవరు పోరాటం చేసినా మేం  సంఘీభావం తెలుపుతాం! ఆవేశంగా స్పీచులు దంచుతాం.

ఆఖరికి ఆ పోరాటాలు పెట్టుబడి దారులు చేస్తున్నా కూడానా?

పోరాటం ముఖ్యం. చేసేది పెట్టుబడిదారుడా, సామాన్యుడా అన్నది ముఖ్యం కాదు. ఇంక్విలాబ్ జిందాబాద్!! ఆ KCR "పాతరేస్తాం" అనడమేంటి? దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

ఆ మాట అనడం తప్పని మార్క్సు గారే చెప్పరా?

లేదు, కొన్ని కొన్ని మేం ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకుని ఆలోచిస్తాం.

అవునా! మరి ఎమ్మెల్యేలను "పాచి కల్లు తాగే మొఖాలకు ఫారిన్ విస్కీ", "ల్యాప్‌టాప్ మడిచి ఎక్కడో పెట్టుకుంటారు" అంటూ మాట్లాడడం సరైనదేనా?

ఏమో, దాని గురించి ఇంకా నిర్ణయించలేదు. కమిటీ వెయ్యాలి. సమావేశం కావాలి, చర్చించాలి. నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా మార్క్సు చెప్పని విషయాలను మార్క్సిజం లోకి అన్వయించడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఏళ్ళు పట్ట వచ్చు. లేక పోతే చారిత్రిక తప్పిదాలు జరుగుతాయి!

Saturday, October 4, 2014

బతుకమ్మ పండుగ



బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణా ఉద్యమంలో బతుకమ్మ పండుగ మరువలేనిది. అది ప్రజల సాంస్కృతిక మూలాలను గుర్తుకు తెచ్చింది. బహుశా ఆ కారణం చేతనే కావచ్చు ప్రజలు పండుగ చేసుకోవడం కూడా అప్పటి ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకని ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడడానికి అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు. కోర్టుకు వెళ్లి మరీ  పర్మిషన్  తీసుకోవలసి వచ్చింది ప్రతీసారి. స్వాతంత్ర్యోద్యమంలో ఉప్పు సత్యాగ్రహం, రాట్నం వడకడం భాగమైనట్టు తెలంగాణా ఉద్యమంలో బ్రతుకమ్మ ఆడడం కూడా భాగమైంది.

ఉద్యమ ఫలితంగా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణా రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉంటుందన్న విషయం ఊహించనిదేమీ కాదు. అనుకున్నట్టే కెసిఆర్ ప్రభుత్వం పది కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన రీతిలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన ఉత్సవాలు నభూతో అన్నట్టుగా ఉన్నాయి.

నాకు వీలు చిక్కక ట్యాంక్ బండ్ వెళ్ళలేదు. టీవీలో చూడడమే జరిగింది. అయితే నగర శివార్లలోని ఒక గ్రామపంచాయితీ లో బతుకమ్మ వేడుకలలో మా కుటుంబంతో సహా పాల్గొనడం జరిగింది. ఊళ్ళోని ప్రభుత్వ పాటశాల మైదానంలో పండుగ నిర్వహించారు. ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయడం వల్ల ఇదివరకంటే ఏర్పాట్లు బాగున్నాయి. దగ్గరలో నీటి వసతి లేక పోవడం వల్ల ఆవరణ లోనే ఒక చిన్న జలాశయాన్ని నిర్మించారు. అందువల్ల స్త్రీలకు బతుకమ్మలను నిమజ్జనం చేసుకోవడం ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఈ పధ్ధతి ప్రతి చోటా అమలు పరిస్తే బాగుంటుంది. చెరువులు, కుంటలు ఉన్న చోట వాటికి మెట్లు నిర్మిస్తే చాలు.

ఇక పొతే చిన్ననాడు మా వూరిలో చూసిన బతుకమ్మ పండుగకు దీనికి పోలికే లేదు. అప్పటిలా పాటలు పాడుకోవడం కనిపించ లేదు. 10000 వాట్ల లౌడ్ స్పీకర్లతో వచ్చే పాటల హోరులో పాటలు పాడుకుందా మనుకున్న  వారికి కూడా వీలు కాకుండా వుంది. అంతకన్నా ఎవరి పాటలు వారినే పాడుకోనిస్తే బాగుంటుందేమో అనిపించింది. బతుకమ్మ ఆటలో భాగంగా పాటలు ప్రిపేర్ చేసుకుని వచ్చిన వారు కొంత నిరాశకు గురైనట్టు కనిపించారు. పాటలు పాడకుండా ఊరికే ఆడవలసి వచ్చినందుకు కొంత విసుగు చెందినట్టు వారి మాటల వల్ల తెలిసింది.

ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తప్పనిసరిగా చర్చించుకోవాలి. బతుకమ్మ పండుగ ఆవరణలో పెద్ద స్టేజీ నిర్మించి అన్ని పార్టీల రాజకీయ నాయకులు పరివేష్టించి, స్పీచులు దంచడం, బతుకమ్మలాటను వీక్షించడం... మైకులో రన్నింగ్ కామెంటరీలు, ఆడే మహిళలకు ఇబ్బంది కలిగించే విషయం. పండుగలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అది. అలాగే వారిని సంతోష పరచడానికన్నట్టు తీన్ మార్ డ్యాన్సులు, తీన్ మార్ పాటలు పెద్ద సౌండ్ తో పెట్టడం కూడా బతుకమ్మ ఆడే స్త్రీలకూ అసౌకర్యాన్ని కలిగించాయి. ఇది చూస్తె మరోరకమైన రికార్డింగ్ డ్యాన్సుల సంస్కృతీ పెరిగి పోతుందేమోనన్నభయం కలిగింది. రాజకీయులు ఏర్పాట్లు మాత్రం చేసి పండుగకి దూరంగా ఉంటేనే మంచిది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పండుగ ఏర్పాట్లలో కొన్ని మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం వుంది.