Sunday, December 8, 2013

తెలంగాణా ఏర్పాటులో కాంగ్రెస్ స్వార్థం?

సమైక్యవాద దోపిడీ శక్తులు మరొక్క సారి తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకంగా ముప్పేట దాడిని మొదలు పెట్టాయి. ఆ దోపిడీ భూతానికి గల మూడుచతుర్ముఖాలు చంద్రబాబు, జగన్, కిరణ్ రెడ్డి మరియు జయప్రకాశ్ నారాయణ్. దాని చేతిలో వున్నా ముళ్ళగద సీమాంధ్ర మీడియా. దానికి గల చోదక శక్తి సీమాంధ్ర పెట్టుబడి దారులు, కాంట్రాక్టర్ల నల్ల ధనం.

వీరందరూ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏమంటే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి మాత్రమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొడుతుంది అని.

కాంగ్రెస్ ఇంతవరకు వారి ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. బహుశా రాహులే అనుకుందాం. ఏ పార్టీ అయినా తన అభ్యర్థి ప్రధానో, ముఖ్యమంత్రో కాకూడదని ఎందుకు అనుకుంటుంది? ప్రజాస్వామ్య మూల సూత్రం అదే కదా?
అధికారం లోనికి రావాలంటే ప్రజోపయోగమైన పనులు చేయాలి. అవి చేస్తేనే వోట్లు పడతాయి. వోట్లు పడితేనే అధికారం లోనికి వస్తారు ఎవరైనా. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది.

చంద్రబాబుకు , జగన్ కు ఆ విషయం తెలియదా? జగన్ సంగతేమో కాని చంద్రబాబుకు బాగా తెలుసు. ఆ అధికారానికి అర్రులు చాచే కదా 2008లో తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ప్రణబ్ కి లేఖ పంపింది? కాని చివరి నిముషంలో (తెలంగాణలో ఎన్నికలు అయ్యాక) 'వీసా సిద్ధాంతం' బయటికి తెచ్చి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నెత్తిమీద నీళ్ళు కుమ్మరించాడు, అది వేరే సంగతి.

జగన్ మాత్రం ఈ విషయంలో ఏం తక్కువ తిన్నాడు? ప్లీనరీలో తెలంగాణా ఉద్యమం మీద సానుభూతి ప్రకటించ లేదా? ఆర్టికల్ మూడు అనుసరించి రాష్ట్రాన్ని విభజించమని కేంద్రానికి బ్లాంక్ చెక్ ఇవ్వలేదా? ఇవన్నీ వోట్లకోసం కాదా? ఒక వేళ వోట్లకోసం కాకుంటే అందులో న్యాయం వుండడం వల్ల అయ్యుండాలి. అది వోట్ల కొసమైతే అదే పని కాంగ్రెస్ చేస్తే తప్పేమిటి? అలా కాక తెదేపా, వైకాపా ఆయా సమయాలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలు హేతుబద్ధమైనవే అయినట్టయితే మరి కాంగ్రెస్ చేస్తున్న తప్పేమిటి? ఇవి వారివద్ద సమాధానం దొరకని ప్రశ్నలు.

జగన్ అయినా, చంద్రబాబు అయినా తమ కుహనా తెలంగాణా అనుకూల వాదంతో ఆ ప్రాంత ప్రజలను మోసం చేయాలనున్నరన్నది ఇప్పుడు బయట పడ్డ వాస్తవం! వారికి ఏ సమయంలోనూ రాష్ట్రాన్ని విభజించాలన్న ఆలోచన లేదు. తెలంగాణా ప్రజలను మోసం చేసి ఎలా వోట్లు దండుకుందామన్న ఆలోచన తప్ప!

ఈ మోసగాళ్ళకు గుణపాఠం చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్భజన నిర్ణయం తీసుకుంది! తాము తీసుకోలేక పొతే బిజెపి ఎలాగైనా తెలంగాణా ఇస్తామంటుంది. ఆ క్రెడిట్ దానికి దక్క కుండా చేయడం కూడా కారణం కావచ్చు. కారణాలు ఏవైనా ఈ కుట్రబాజీ నాయకులకు సోనియాని గాని, కాంగ్రెస్ ను గాని విమర్శించే అర్హత లేదు!

తెలంగాణాను ఇవ్వడం ద్వారా 25 సీట్ల ఆంధ్రాను కాదని 19 సీట్ల తెలంగాణాను ఎంచుకోవడం వల్ల కాంగ్రెస్ పెద్ద రిస్కే చేసింది. నిజానికి ఇన్ని రోజులు, సమైక్య వాదులు చెపుతున్న వోట్లు, సీట్లు చూసే తెలంగాణా వాదంలో ఎంత నిజాయితీ వున్నా, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెనుకాడింది. ఎప్పుడైతే తెలంగాణా వాదంపై సానుభూతి ప్రకటించిన లంచగొండి జగన్ ను ఆంద్ర ప్రాంత ప్రజలు గెలిపిస్తూ, కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేశారో, అప్పుడే తెలంగాణా ఏర్పాటుకు బీజం పడింది. అది ఆంధ్ర ప్రజలు చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధం! అప్పుడే సమైక్యవాదంపై ఆంధ్ర ప్రజలకి ఎంత నిబద్ధత వుందో అధిష్టానానికి అర్థమైంది!

తెలంగాణను ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి స్వార్థం ఉంటే ఉండవచ్చు, ఆ స్వార్థం మిగతా పార్టీలకి ఉన్న లాంటిదే తప్ప వేరు కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రాన్ని స్వార్థంతో ప్రకటించినా, మరోలా ప్రకటించినా, అది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిందే తప్ప వేరు కాదు.

No comments:

Post a Comment