Friday, November 22, 2013

రాయల తెలంగాణా కావాలెనట!

జేసి దివాకర్ రెడ్డి కొత్త రాగం అందుకున్నడు. రాయల తెలంగాణా కావాలెనట! అంటే రాజసీమ లోని కర్నూలు, అనంత పురం జిల్లాలు కూడా తెలంగాణాల కలుపాలె అని ఆయన భావం.

ఈ మాట అనేటందుకు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. రాయల తెలంగాణా పెరుతోని హైదరాబాదులోని కబ్జా భూములు, అక్రమ వ్యాపారాలు, సక్రమ వ్యాపారాలు కాపాడుకునే టందుకు ఇదొక ఉపాయం కావొచ్చు. కాని అక్కడి ప్రజల్లో వున్న భావన కూడా కొంత వరకు ప్రతిఫలిస్తుండవచ్చు.

కర్నూలు, అనంతపురం జిల్లాలు నీటికోసం పూర్తిగా కృష్ణా, తుంగభద్ర జలాల మీద ఆధార పడ్డాయి. అనంతపురం దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతం. తెలంగాణాల కలిస్తే వారి భవిష్యత్తుకు, మిగులు జలాల పేరుతొ పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పుడు తరలిస్తున్న నీటి వాటాకు ధోకా ఉండదనేది వారి భావన కావచ్చు.

ఏదేమైనప్పటికి ఈ రకమైన వాదన చేసే సమయం ఎప్పుడో దాటిపోయి విభజన అంకం చివరి దశకు చేరుకున్నది. ఇప్పుడు ఇటువంటి వాదనలు చేసుడంటే తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపుల్లలు వేసుడుగానే తెలంగాణా ప్రజలు భావిస్తరు. గతంలో వారు ఇటువంటి అడ్డుపుల్లలు ఎన్నో వేసి వున్నరు కాబట్టి అట్లా అనుకునేటందుకే ఎక్కువ అవకాశం వుంది.

తెలంగాణా ప్రజలు మొదటినుండి తమ పదిజిల్లాల తెలంగాణా రాష్ట్ర ఏర్పాటునే కొరుతున్నరు. అంతకు మించి వారికి ఒక్క ఊరు కూడా ఎక్కువ అవసరం లేదు. గత అనుభవాల వలన, కొత్తగా వచ్చిన ఈ  రాయల తెలంగాణా డిమాండును వారు మరో రకం కుట్రగా మాత్రమె చూస్తరు తప్ప, తమపై ప్రేమతో వచ్చి సదరు జిల్లాల వారు కలుస్తున్నరని భావించే అవకాశం లేదు.

ఆ రెండు జిల్లాల వారు కూడా ఇప్పటివరకు సీమాంధ్రలో భాగంగానే భావిస్తు వస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణా వాదులకు వ్యతిరేకంగా వారు జరిపిన సమైక్యాంధ్ర పేరుతొ జరిపిన ఉద్యమమే అందుకు సాక్ష్యం. ఇప్పటి వరకు తెలంగాణా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, రేపు తెలంగాణా ప్రజలతో మమేకం అవుతారని అనుకోలేం.

నిజంగా ఆ రెండు జిల్లాల ప్రజలు తెలంగాణాల కలుస్తందుకు అభిలషిస్తున్న వారు అయితే, వారు మొదటి నుండి తెలంగాణా ఉద్యమం లో పాల్గొన వలసింది. లాఠీ దెబ్బలు తిని ఉద్యమాలు చేయక పోయినా కనీస నైతిక మద్దతు అన్నా ఇచ్చి ఉండ వలసింది. అదేమీ చేయకుండా పైపెచ్చు సమైక్య వాదనతో, తెలంగాణా ఏర్పాటు వ్యతిరేకులతో అంట కాగి, ఇప్పుడు విభజన తప్పదన్న పరిస్థితుల్లో, 'మేం కూడా మీతో కలుస్తాం' అని వస్తే తెలంగాణా ప్రజలు సంతోషిస్తరని అనుకోలేం.

ఏదేమైనప్పటికీ ఇటువంటి వాదనలు చేసే సమయం ఎప్పుడో దాటి పోయింది. ఇప్పుడు ఉన్న కొద్ది సమయంలో పది జిల్లాల తెలంగాణా ఏర్పాటు తప్ప తప్ప మరో విపర్యం లేదు.  

No comments:

Post a Comment