నువ్వు తెలంగాణా వాదానికి పర్యాయ పదంగా మారిపోయినవు. తెలంగాణా ప్రజలు నీ మీదనే కొండంత ఆశలు పెట్టుకున్నరు. నువ్వేమో ఆర్నెల్ల కొక్కసారి డిల్లీ నుంచి ఎవ్వో సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట కాలం ఎల్లదీస్తున్నవు. ఎప్పుడు గూడ సిగ్నల్సు వచ్చుడే గని తెలంగాణా మటుకు వస్తలేదు.
పదకొండేండ్ల నుంచి ఉద్యమాన్ని ఒక్కొక్క మెట్టే పైకెక్కించినవు. ఇప్పుడు తెలంగాణా వచ్చుడు మీద తెలంగాణా వాదులకే కాదు, కరడుగట్టిన సమైక్యవాదులకు కూడా అనుమానం లేకుండ చేసినవు. తెలంగాణా గ్రామ గ్రామాన ఉన్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం చూపెడుతున్న అలసత్వాన్నికి అగ్గిమీద గుగ్గిలం లెక్క ఉడికి పోతున్నరు. అవకాశం వచ్చినప్పుడు తడాక సూపిస్తందుకు సిద్ధంగనే ఉన్నరు.
పదకొండేండ్ల కింద మనసుల ఎంత కోరిక వున్నా తెలంగాణా వచ్చుడు మీద ఎవరికీ ఆశ లేకుండే. కాని ఇప్పుడు అట్లా గాదు. తెలంగాణాల వున్నా పసిబిడ్డ కూడ తెలంగాణా రాష్ట్రం రాదంటే ఒప్పుకొని పరిస్థితి. పైపైన మండే మంటలు సల్లబడుతయెమో కాని ప్రజలకు తెలంగాణ పైనవున్న ఆకాంక్షలు పైపై మంటలు కావు. అవి తెలంగాణ వచ్చుడు దాంక సల్లబడవు.
ఇప్పుడు తెలంగాణా పోరాటం మీద నీకున్న నిబద్ధతను కొత్తగ చాటుకునే అవుసరం లేదు. నువ్వుగాని, నువ్వు నాయకత్వం వహిస్తున్న పార్టీగాని తెలంగాణ కోసం తప్ప ఇంకోదానికి పని చేస్తున్నయంటే ఆంధ్రల కూడ ఎవ్వడు నమ్మడు. అందుకే కొంత మందికి నీమీద అంత కోపం. బయటికి తెలంగాణ వాదం మాట్లాడుతూ చెంద్రబాబు ముందు తెలంగాణ పదం ఎత్తేతందుకు లాగు తడుపుకునే తెలుగుదేశం వాళ్ళు కాని, తామే పెద్ద తెలంగాణా వాదులమని చెప్పుకుంట, సోనియా గాంధీ దగ్గెర బిక్క మొకం పెట్టే కాంగ్రేసు వాళ్ళు కాని, వీళ్ళ అసలు రంగులు జనానికి పూర్తిగా తెలిసి పోయినై.
TRS తప్ప ఒక్క రాజకీయ పార్టీ గాని , ఆ పార్టీలకు చెందిన ఒక్క రాజకీయ నాయకుడు గాని, ఇంతవరకు తెలంగాణా వాదాన్ని తమ సొంత అవసరాలకు వాడుకోవడం తప్ప తెలంగాణా ప్రజల కోరికల మేరకు నిలబడ్డ పాపాన పోలేదు.
తుపాకి గొట్టాన్ని అడ్డం పెట్టుకొని అట్టహాసంగా సాగిన విజయలక్ష్మి దీక్ష యాత్ర కేవలం తెలంగాణ మీదికి దండయాత్ర మాత్రమే. ప్రజలు అది గమనించ లేనంత తెలివి తక్కువ వాళ్ళు కారు. ప్రజలు ఈరకంగా తెలివి మీరుడుకు కూడా కారణం వేరొకటి కాదు, నువ్వే! ఇప్పుడు ప్రజలు తెలివిన పడ్డరు. నీ పుణ్యమా అని తెలంగాణ కోసం పోరాడేది ఎవడో, వంచన చేసుకుంట బతికేది ఎవడో, ప్రజలకు తెలుస్తనే వుంటది.
ఇప్పుడు నువ్వు కొత్తగ సిగ్నల్సు ఉన్నయి. తెలంగాణ ఇగ వస్తుంది, ఆగ వస్తుంది అని చెప్పుడు అవసరమా? సిగ్నల్సు వచ్చినా రాకపోయినా ప్రజలు పోరాటం ఆపరు, నిన్ను ఆపనియ్యరు.
నిజంగనే సిగ్నల్సు వచ్చినయా, వస్తే రానియ్యి. నీ మనసులనే పెట్టుకో. ఒకవైపు సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట ఇంకొక వైపు పోరాటం ఎట్ల చెయ్యమంటవు? గట్లనే సిగ్నల్సు వస్తున్నయని చెప్పుకుంట, అవి ఇచ్చే కాంగ్రేసు పార్టీని ఎట్ల తూర్పార బడుతవు? దానికి వ్యతిరేకంగ పోరాటాలు ఎట్లా చేస్తవు? ఎందుకో ఈ విషయంల నీ వ్యూహాలు సరిగ్గ వున్నట్టు అనిపిస్త లేదు. జర ఆలోచించు.
అసలు సిగ్నల్సే వస్తలేవా? అది ఇంకా ఘోరమైన పరిస్థితి! లేని సిగ్నల్సు వస్తున్నయని చెప్పవడితే, కొంత కాలానికి అది 'నాయనా పులివచ్చే' అన్న సామెత అయి కూసుంటది. అబద్ధమని తెలిసినంక ప్రజలు ఎంతకాలం నమ్ముతరు? ప్రజలకు నీ మాటల మీదనే నమ్మకం పోతది. అట్ల నమ్మకం పోయేటందుకు ఆంధ్ర మీడియా శాయశక్తుల ప్రయత్నం జేస్తది. గది మరిచి పోకు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఏర్పడుతదనే సిగ్నల్ పదేండ్ల కిందనే వచ్చింది. అందుకనే ప్రజలు నీకు మద్దతు పలుకుతున్నరు. ఆ సిగ్నల్ మరేదో కాదు, నువ్వే. నీ నాయకత్వం మీద జనానికి నమ్మకం వుంది. తెలంగాణ వచ్చేదాంక ఆ నాయకత్వం కింద పోరాటం చేస్తమని, తెలంగాణ సాధించుకుంట మన్న నమ్మకం వాల్లకుంది. వాల్లకు వేరే సిగ్నల్సు అవసరం లేదు. సజ్జాలని కాంగ్రెస్ పార్టీయో , కేంద్ర ప్రభుత్వమో ఇచ్చే సిగ్నల్సు అసలు అవసరం లేదు.
పెట్టుబడిదార్లకు, దోపిడీ దార్లకు కొమ్ముకాసే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడకుండా సర్వశక్తులు ఒడ్డుతది . తెలంగాణ ఇచ్చేదే అయితే మొన్నటి రాష్ట్రపతి ఎన్నికలల్ల మీ సహాయం తీసుకొనేది. ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు జగన్ కు మనకంటే ఎక్కువున్నయా? మరి జైల్ల మూలుగుతున్న జగన్ తోటి ఎందుకు కుమ్మక్కయినట్టు? గిది నువ్వు చెప్పక పోయినా జనం అర్థం చేసుకుంటనే వున్నరు.
ఇప్పుడు తెలంగాణా వాదానికి TRS కేంద్రకం అయింది. TRS పార్టీకి నువ్వు కేంద్రకానివి. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలతోని చాల ప్రభావం వుంటది. మాట్లాడే ముందు నీపైన చాన బాధ్యత వుంటది. కాబట్టి జర చూసి మాట్లాడు. జనానికి వాస్తవాలు మాత్రమే వివరించు. అది మంచైనా చెడైనా సరే. నీ మాటమీద జనానికి గురి తప్పకుండ చూసుకో.