శ్రీక్రిష్ణ కమిటీ రాంగనే, కొంతమంది ఆంధ్రా బ్లాగర్లు సంకలు గుద్దుడు మొదలు పెట్టిన్రు. ఇంక తెలంగాణ మన పర్మినెంటు కబ్జకి వచ్చింది అనుకుంట మురువ బట్టిన్రు.
గక్కడనేమొ లగడపాటి, రాయపాటి, కావూరి, వెంకటేశు, దివాకర్‍లు నవ్వాల్నో, ఏడ్వాల్నో తెలువక చేతులు పిసుక్కుంట కూసున్రు. గిట్ల ఎందుకైందో శ్రీకృష్ణ మిటీ నివేదిక చదివినోనికి ఊరికనే తెలుస్తది.
గా నివేదికల రాయల తెలంగాణ ఒద్దని చెప్పె. గ్రేటర్‍హైద్రాబాదుతోని కలిపి, నల్లగొండ, మహబూబ్‍నగర్‍ల కొంత జాగ కలిపి కేంద్ర పాలిత ప్రాంతం చేస్తరేమో అంటే గదిగూడ ఒద్దని చెప్పిరి. కనీసం హైద్రాబాదును కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలంటె గూడ ఒప్పుకోక పొయిరి.
గిప్పుడున్న తీర్గ సమైక్యాంధ్ర అసలుకే ఒద్దన్నరు.
ఇంతకి, వాళ్ళు చెప్పిందేంది?
గా 1956లనే మరిచి పొయిన పెద్దమనుషుల ఒప్పందానికి దుమ్ము దులిపిన్రు. పొయ్యి దాంట్లె చూసుకోని గండ్ల జెప్పినట్టు ప్రాంతీయ అభివృద్ధి మండలి పెట్టమని చెప్పిన్రు. దానికి చట్టభద్రత ఉంటదట. దానికి ఒక చైర్‍మన్ ఉంటడట. ఆయనకు మంత్రి హోదా ఉంటదట. గా మండలి గీ తెలంగాణా లోపల జరిగే నియామకాలు, నీల్లు, డబ్బు కేటాయింపులు వగైరాలు సూస్తుంటదట. ఏమయిన తప్పులు జరిగితే జీహుజూర్ అనుకుంట ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్నంట. ఏ పని చేసినా అసెంబ్లీకి జవాబు దారీగ ఉండాల్నంట.
తెల్వకడుగుత, ముఖ్యమంత్రి ఎప్పుడయిన మన చరిత్రల గిట్లాంటోల్లు చెప్పిన మాట ఇన్నడా? కనీసం అసెంబ్లి ఎప్పుడన్న తెలంగాణ పాట పాడుతదా? దాంట్లె ఎక్కువ మంది ఎవ్వరు ఉంటె గాల్ల పాటే పాడుతది.
గీ ముచ్చట జెప్పనీకి శ్రీకృష్ణ కమిటీకి యాడాది పట్టిందంటె నమ్మబుద్ధి కాదు! తెలంగాణల చిన్న పిల్లగాడు చెప్పుతడు, గియ్యన్ని అయ్యే పనులు కావని! గియ్యన్ని అమలుగావాలెనని పోరాడి పోరాడి అప్పుడే యాభైనాలుగేండ్లు గడిచిపాయె. పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి అన్నట్టు, మల్ల గీ శ్రీకృష్ణ గారు పాతపాటే చెప్పబట్టె. గీ మాట చెప్పినందుకే మన ఆంధ్ర బ్లాగరు సోదరులు సంకలు నొప్పిపెట్టే దాన్క గుద్దుకుంటున్రు. ఇంక సాలురబై అన్నా గూడ ఇంటలేరు.
ఇంతకు శ్రీకృష్ణ ఏంజెప్పిండు? గిట్ల చేసుకో గలిగితే చేసుకోండ్రి అన్నడు. గిది జరుగని పని అని ఆంధ్రోల్లతో పాటు దేశంల అందరికి తెలుసు. అయితే మల్ల ఇంకేమన్న జెప్పిండా అంటె ఇంకోటి గూడ జెప్పిండు. గిది జరుగకపోతే తెలంగాణ, ఆంధ్ర విడదియ్యమన్నడు. విడదీసి తెలంగాణాకు హైద్రాబాదు రాజధాని జెయ్యమన్నడు. ఆంధ్రకు అక్కడ్నే ఏదన్న పట్టణంజూసి రాజధాని కొత్తగ పెట్టమన్నడు.
ఇప్పుడు కమిటీలు, కౌన్సిల్లు అనుకుంట ఊకదంపుడు మాటలు చెప్పితె ఇనేటోల్లు తెలంగాణల ఎవ్వరులేరు. గందుకోసమైనా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇచ్చుడు తప్ప వేరే మార్గం లేదు.