ఆయన అసెంబ్లీల వికటాట్ట హాసాలు చేసేటోడు. అవును, ప్రతిపక్ష నాయకులు ఆయన చేస్తున్న దోపిడీలు చూసి కడుపు మండి కోపం తోటి, ఆవేశంగ చేసే విమర్శలు చూసుకుంట వెకిలి వికటాట్ట హాసాలు చేస్తుండేటోడు. ఎవనికైనా తనను విమర్శిస్తూ తిడుతుంటే, పౌరుషం పెరుగుతది, కోపం వస్తది. లేక నిజంగా తాను చేస్తున్నది తప్పే అని అనిపిస్తే తల ఎక్కడ పెట్టుకోవాలేనా అనిపిస్తది. కాని ఆ రాజన్నకు అట్ల ఎన్నడూ అనిపిచ్చినట్టు కనపడలేదు. తనను ప్రతిపక్ష నాయకులు విమర్శించినంత సేపూ వెర్రి నవ్వులు నవ్వడం రాజన్నకు సర్వ సాధారణం. ఆ నవ్వుల కారణం స్థూలంగా అర్థమైనా అసలు కారణం మాత్రం అస్పష్టమే.
"వెర్రి నాయనలారా! మీరెన్ని తిట్టినా నేను చేసేది చేస్తూనే ఉంటా. మీరు ఏమీ పీకలేరు."
"పిచ్చోల్లారా మీరు లేవనెత్తి తిడుతున్నా విషయాలు చాలా చిన్నవి, నేను లక్షల కొట్లలో తింటే, మీరు ఒకట్లకు, పదులకు ఆవేశ పడుతున్నారు. అసలు విషయం తెలిస్తే ఇంకేమవుటారో!"
"మీరు అధికారంలో ఉన్నప్పుడు నేను తిన్నదాంట్లో పావు భాగం కూడా తినలేక పోయారు. ఎందుకు మీ బతుకు? నన్ను చూడండి... ఎలా తింటున్నానో!"
ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే స్థూలంగా వీటన్నిటి అర్థంఒక్కటే... తాను చేస్తున్న అక్రమాలను చూసుకొని అదో గొప్పతనంగా విర్రవీగడం.
ఇక పోతే ఆయన పుత్రరత్నం సంగతి మరీ విచిత్రం. ఎవడైనా దొంగ ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో ఇరుక్కుని నెలలకు నెలలు జిల్లాలో మగ్గుతుంటే, ఇసుమంతైనా సిగ్గూ, శరం ముసురుకుంటది. కెమెరాలకు, చూసే జనానికి మొకం చాటెయ్యాలని అనిపిస్తది. కాని లక్ష కోట్లు భోంచేసిన ఈ నయా (వి)నాయకుని రూటే వేరు. చంచల్ గూడా జైలు గేటులోంచి వస్తూ, పోతూ ఒకటే దండాలు దరహాసాలు! ఏదో స్వతంత్ర పోరాటంలోనో, ఇతర ప్రజా పోరాటాల్లోనో పాల్గొని అరెస్టయినట్టు బిల్డప్పు! తండ్రి నవ్వుకు కారణం కనిపెట్ట వచ్చేమో కాని, ఈ కొడుకు నవ్వుకు కారణం కనిపెట్టడం మరీ కష్టం.
"పిచ్చి సిబిఐ! మీరెన్ని కేసులు పెట్టినా నన్ను ఏమీ పీకలేరు. అమ్మగారి అసలు గుట్టుమట్లు నాదగ్గర ఉన్నయ్. అవి నా దగ్గరున్నంత వరకు, మీరు నా వెంట్రుక కూడా కదపలేరు."
"ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతగా నా అవినీతి బయట పెట్టినా నాయకులందరూ నా జైలు చుట్టే తిరుగుతున్నారు. జనాలు నా చెల్లెలి యాత్రలకే వస్తున్నారు. అలాటి జనం ఉన్నంత వారకు మీరు నన్నేం చేయగలరు?"
"మీరు నన్ను జైల్లో పెట్టాననుకుంటున్నారు. కాని ఇక్కడ జైలరుతో సహా అంతా నావాళ్ళే! నాకు రోజుకో మొలఖాత్, పూటకో బిర్యానీ, గంటకో మర్యాద! నా పార్టీ ఆఫీసులో కూడా ఇంట సౌకర్యంగా వుండదు."
ఇట్లా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం. తాను చేసిన అక్రమాలను చూసుకొని అదో గొప్పతనంగా మురిసి పోవడం.