Thursday, July 22, 2010

చంద్రబాబు కుతంత్రం

వోల్వో బస్సుల మాహారాష్ట్రకు పొయ్యి ఏర్ బస్సుల తిరిగి వచ్చిండు చంద్ర బాబు.

తెలంగాణాల ఈయన పరపతి ఇసుమంత కూడా పెరగ లేదు. ఇప్పటికీ తెలంగాణాల చూపెట్టుతందుకు ముఖం లేదు. ఎలాగోలా బాబ్లీ పేరు చెప్పి తెలంగాణాను ఇంకోసారి మోసం చెయ్యడానికి బాగనే ప్రయత్నం చేసిండు. కాని ఈయన పన్నాగాలు తెలంగాణాల పారలేదు.

ఇంకా ఈయన సాధించింది.

ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి చర్చలు జరుపుదాం అన్నా వినకుండా అరెస్టు చేస్తరని తెలిసి కూడా బాబ్లీకి వెళ్ళడం. అక్కడికి వెళ్లి తన్నులు తిని తెలుగువాడి పరువుని గొదావరిల కలపడం.

తిరిగి వచ్చి తెలుగు తమ్ముళ్ళ చేత మహా రాష్ట్ర లారీలు, బస్సులు తగల బెట్టించడం.

మహారాష్ట్ర దురభిమాని 'బాల్ థాకరే' ఏదో అన్నడని ఆయన దిష్టి బొమ్మ తగుల బెట్టించి తాను కూడా 'ఆంద్ర దురభిమాని' గా చాటు కోవడం. 
 
ఇంతా చేసిన తర్వాత ఇప్పుడు బాబ్లీ ఆగుతుందా? మళ్ళీ చర్చలు జరప వలసిందే. కేసు కోర్టుల తెల వలసిందే. 

పైనించి ఈయన మాహారాష్ట్ర వాళ్ళను రెచ్చగొట్టి వచ్చిండు. బాబ్లీ పైన వాళ్ళ పట్టుదలలను పెంచిండు. ఇప్పుడు మహారాష్ట్రల అధికార పక్షం, ప్రతి పక్షం అంత ఒక్కటై బాబ్లీని రక్షించు కుంతందుకు తయ్యారయ్యిండ్రు.

ఈయనకు ఇదంత జరుగుతదని తెలువదా?

ఎందుకు తెలువదు? బాగా తెలుసు. అరెస్టయిన గంటల లోపే ఫ్లేక్సీలు గూడ రడీ అయినాయి అంటేనే తెలుస్తది ఈయన ఎంత ప్లాను మీద ఉన్నడో!

మరి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతది అని తెలిసి గూడ ఎందుకు ఈవిధంగ చేసిండు?

ఈయనకు తెలంగాణా మీద ఎప్పుడూ ప్రేమ లేదు.

ఏ శ్రీరాం సాగరు కొరకైతే బాబ్లీ సమస్య ఎత్తుకున్నడో ఆ శ్రీరాం సాగరు కాలువలు తొవ్వేటందుకు ఈయన ఎప్పుడూ ప్రయత్నం చెయ్యలే. శ్రీశైలం ఎడమ కాలువ తోవ్వడానికి గూడ ప్రయత్నం చెయ్యలే. ప్రతిపక్ష నాయకుని హోదాల కూడా పట్టించుకోలే.

రాజోలిబండ గేట్లు ఇరగ్గొట్టి ఈయన హయాంల రాయలసీమకు నీళ్ళు కొనబోయ్యి, మహబూబ్ నగర్ని ఎడారిగ మారిస్తె ఈయన తెలంగాణా కన్ను గుడ్డి పోయింది.

పోతిరెడ్డి పాడు అక్రమంగ కడుతుంటే ఒక్క సారి గూడ ఖండిస్తూ చిన్న స్టేట్ మెంట్ గూడ ఇయ్యలే.

పోలవరం ప్రాజెక్టు కింద లక్షలాది తెలంగాణా బిడ్డలు మునిగి పోతుంటె ఈయనకు అదేమి పట్టదు.

ఇలాంటి మనిషి తెలంగాణాను ఉద్ధరిస్తడు అనుకునేటందుకు తెలంగాణా ప్రజలు ఎడ్డోళ్ళు కారు. గుడ్దోల్లు అంతకంటె కారు.

ఇన్ని చెప్పే అవసరం లేదు. డిసెంబరు 9న ప్రకటన వచ్చినంక, సైంధవుని లెక్క ఈయన ఎట్ల అడ్డం బడ్డడో తెలంగాణా బిడ్డ లెవ్వరు ఇంకా మరిచి పోలే.

ఈయన నక్క ఎత్తులు, జిత్తుల ఆంధ్రల పారుతయేమో కాని తెలంగాణాల కాదు.